పశ్చిమబెంగాల్: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీకి కేంద్రం షాక్ ఇచ్చింది. పశ్చిమబెంగాల్ పేరు మార్చాలన్న మమతా బెనర్జీ ప్రతిపాదనను కేంద్రం తోసిపుచ్చింది. పేరు మార్పు కుదరదని తేల్చి చెప్పేసింది. 

పశ్చిమబెంగాల్ ను బంగ్లా రాష్ట్రంగా మార్చాలని మమతా బెనర్జీ కేంద్రాన్ని కోరారు. రాష్ట్రం పేరు మార్పుపై అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్నికేంద్రానికి పంపించారు. మమతా బెనర్జీ ప్రతిపాదనను పరిశీలించిన కేంద్ర హోంశాఖ పేరు మార్చడం కుదరదంటూ తేల్చి చెప్పేశారు. పేరు మార్పుకు రాజ్యాంగ సవరణ అవసరమని స్పష్టం చేసింది.   

పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అక్షర క్రమంలో చివర ఉండటంపై సీఎం మమతా బెనర్జీ గుర్రుగా ఉన్నారు. అక్షర క్రమంలో చివర ఉండటంతో బెంగాల్ రాష్ట్రం వివక్ష ఎదుర్కొంటుందని దీదీ వాదిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే పేరు ప్రతిపాదనను తీసుకువచ్చారు. 

ఇకపోతే పశ్చిమబెంగాల్ పేరు మార్చాలని 2016లోనే మమతా బెనర్జీ ప్రతిపాదన తీసుకువచ్చారు. మూడు భాషల్లో మూడు పేర్లను మమత ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించింది. బెంగాలీలో ‘బంగ్లా’, ఆంగ్లంలో ‘బెంగాల్’, హిందీలో ‘బంగల్’ అనే పేర్లను రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసింది. 

అయితే మూడు పేర్లను సూచించడంపై ఆనాటి కేంద్రహోంశాఖ ప్రతిపాదనను తిరస్కరించింది. ఒక్కపేరునే సూచించాలని దీదీ సర్కార్ కు సూచించింది. దీంతో 2018, జులై 26న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో వెస్ట్ బెంగాల్ అనే పేరును బంగ్లా గా మార్చాలన్న ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసింది. 

అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపించారు. ఈ ప్రతిపాదనను పరిశీలించిన కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేరు మార్చడం కుదరదని స్పష్టం చేసింది.