రోడ్డు పక్కన గుంతలో పడిపోయిన బస్సు.. 12 మంది యాత్రికులకు గాయాలు..
రోడ్డు పక్కన ఉన్న గుంతలో ఓ బస్సు పడిపోవడంతో 12 మంది యాత్రికులకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా బస్సులో పశ్చిమ బెంగాల్ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పుణ్య క్షేత్రాలు దర్శించాలని బయలుదేరగా.. ఉత్తరప్రదేశ్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ఉత్తరప్రదేశ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మంది యాత్రికులకు గాయాలు అయ్యాయి. పశ్చిమబెంగాల్ లోని మేదినీపూర్ నుంచి 60 మంది యాత్రికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు టూరిస్ట్ బస్సు శనివారం ఉదయం బరేలీ-లక్నో జాతీయ రహదారిపై రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడిపోడిపోయింది. ఈ ఘటన అల్లిపూర్ గ్రామ సమీపంలోని జంగ్ బహదూర్ గంజ్ (జేబీ గంజ్) బైపాస్ వద్ద జరిగింది.
గాయపడిన వారిలో పది మందిని ట్రీట్ మెంట్ కోసం పొరుగున ఉన్న షాజహాన్పూర్ జిల్లాకు తరలించారు. ఈ ప్రమాదంలో మధుమిత అనే మహిళ తలకు తీవ్ర గాయం అయ్యింది. మిగితా అందరికీ స్వల్ప గాయాలు అయ్యాయి. కాగా.. ఈ ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్, అతడి సహాయకుడు పరారయ్యారు.
60 మందితో పశ్చిమ బెంగాల్ నుంచి ఆగస్టు 25వ తేదీన తీర్థ యాత్ర కోసం ఈ బస్సుబయలుదేరింది. గయ, బోధ్గయ, ప్రయాగ్రాజ్, చిత్రకూట్, బృందావన్, హరిద్వార్ వెళ్లి అయోధ్య, వారణాసి ప్రాంతాలను సందర్శించాలని యాత్రికులంతా ప్రణాళిక వేసుకున్నారు. ఈ ప్రమాదంతో వారి యాత్రకు బ్రేక్ పడింది.
అంతకు ముందు ఇదే జిల్లాలోని జిల్లాలోని మీర్జాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. మోటార్ సైకిల్ ను బస్సు ఢీకొనడంతో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. మరొకరికి గాయాలు అయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. ముషార్రఫ్ (30), అతడి సోదరుడు మష్రూర్ (25), అలాగే 55 ఏళ్ల బుద్దు అనే వ్యక్తితో కలిసి బైక్ పై ప్రయాణిస్తున్నారు. శుక్రవారం రాత్రి గౌషేరా గ్రామ సమీపంలోకి రాగానే వారి బైక్ ను ఓ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముషారఫ్, మష్రూర్ అక్కడికక్కడే మృతి చెందారు. బుద్దును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు జైన్ తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ తన బస్సుతో పరారయ్యాడు. అతడి ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.