వారిద్దరికీ పెళ్లి నిశ్చయమైంది. ఇరుకుటుంబాలు పెళ్లి ఏర్పాట్లు చేశారు. పెళ్లి కూడా జరిగిపోయింది. ఆ తర్వాత పెళ్లి కొడుకు తన గొంతెమ్మ కోరికల చిట్టా విప్పడం మొదలుపెట్టాడు. విందు స‌మ‌యంలో వరుడు... వ‌ధువు త‌ర‌పువారిని  బుల్లెట్ వాహ‌నం కావాల‌ని అడిగాడు. దీనిపై ఆగ్ర‌హంచిన‌ గ్రామస్తులు అతన్ని బంధించి, చిత‌క‌బాదారు. స‌మాచారం అందుకున్న పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని వరుణ్ణి, అతని తండ్రిని అరెస్టు చేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అమెఠీ గ్రామానికి చెందిన నాసిమ్ అహ్మద్ కుమార్తెకు మొహమ్మద్ అమీర్ కుమారుడు ఇమ్రాన్ సాజ్‌తో వివాహం జ‌రిగింది. అనంత‌రం విందు కార్య‌క్ర‌మం జ‌రిగింది. 

ఈ స‌మ‌యంలో వ‌రుడు బుల్లెట్ వాహ‌నం కావాల‌ని డిమాండ్ చేశాడు. అంత స్తోమ‌త తమ‌కు లేద‌ని వ‌ధువు తండ్రి చెప్పాడు. అయితే వ‌రుడు బుల్లెట్ కోసం ప‌ట్టుప‌ట్టాడు. ఇది ఇరువ‌ర్గాల మ‌ధ్య వివాదానికి దారితీసింది. వ‌ధువు వ‌రునిపై చేయిచేసుకుంది. ఏకంగా చెప్పు తీసుకొని మరీ కొట్టింది. అనంత‌రం గ్రామ‌స్తులు వరుణ్ణి బంధించి, చిత‌క‌బాదారు. స‌మాచారం అందుకున్న పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ఇరు వ‌ర్గాల‌ను పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. స్టేష‌న్‌లో గంట‌ల త‌ర‌బ‌డి చ‌ర్చ జ‌రిగినా స‌మ‌స్య కొలిక్కి రాలేదు. వ‌రుడు విడాకుల‌కు పట్టుబ‌ట్టాడు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.