మహిళా అనారోగ్యం దృష్యా 27 వారాల గర్భాన్ని తొలగించేందుకు బొంబాయి హైకోర్టు అనుమతి ఇచ్చింది. కోర్టు అనుమతితో డాక్టర్లు అబార్షన్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఆమెకు 484 గ్రాములు ఉన్న సజీవ శిశువు జన్మించింది. దీంతో ఆ శిశువు ప్రస్తుతం ఎన్ఐసీయూలో, డాక్టర్ల పర్యవేక్షలో ఉంది.
తల్లి అనారోగ్యం నేపథ్యంలో 27 వారాల గర్భాన్ని తొలగించడానికి బొంబాయి హైకోర్టు అనుమతిచ్చింది. అయితే డాక్టర్లు ఆ తల్లికి ఆబార్షన్ చేసే సమయంలో శిశువు సజీవంగా జన్మించింది. దీంతో ఆ పిండాన్ని పరేల్ లోని కేఈఎం హాస్పిటల్ లో డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచారు. ఆ బిడ్డను తాము చెప్పేంత వరకు, వైద్యుల సలహాలకు విరుద్ధంగా హాస్పిటల్ నుంచి తీసుకురాకూడదని న్యాయమూర్తులు గౌతమ్ పటేల్ మరియు నీలా గోఖలే తో కూడిన బెంచ్ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది.
అసలేం జరిగిందంటే ?
దాద్రా, నగర్ హవేలీలోని సిల్వాస్సాకు చెందిన 20 ఏళ్ల మహిళ మార్చిలో గర్భం దాల్చింది. అయితే ఆమెకు జూలై 25వ తేదీన అనారోగ్యానికి గురైంది. తీవ్రమైన దగ్గు, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలతో స్థానికంగా ఉన్న ఓ హాస్పిటల్ లో చేరింది. అక్కడ పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆమెకు గుండెలో 20 మిల్లీ మీటర్ల రంద్రం ఉన్నట్టు గుర్తించారు. కార్డియాలజిస్టును సంప్రదించాలని సూచించారు.
దీంతో ఆమె తన భర్తతో కలిసి జూలై 30వ తేదీన రాత్రి 11 గంటలకు సిల్వాస్సా నుండి అంబులెన్స్‌లో బయలుదేరి జూలై 31న కేఈఎం హాస్పిటల్ కు చేరుకున్నారు. ఆ సమయంలో ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి డాక్టర్లు పరీక్షించారు. గుండెలో రంధ్రం (ఏట్రియాల్ సెప్టల్ డిఫెక్ట్) వల్ల శ్వాసకోశ ఇన్ఫెక్షన్, తీవ్రమైన పల్మనరీ ఆర్టరీ హైపర్‌టెన్షన్ తో బాధపడుతోందని నిర్ధారించారు. గర్భం కొనసాగితే ఆమె ప్రాణాలకే ప్రమాదమని గుర్తించారు.
అయితే ఆమె గర్భం 27 అప్పటికే వారాలకు చేరుకుంది. ఆ మహిళకు అబార్షన్ చేయాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి కావడంతో కేఈఎం హాస్పిటల్ మెడికల్ బోర్డు బొంబాయి హైకోర్టును ఆశ్రయించింది. ఆమె పరిస్థితి మొత్తం వివరించి ఎంటీపీ (మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ)కి అనుమతివ్వాలని కోరుతూ ఆగస్టు 3వ తేదీన ఓ నివేదిక అందజేసింది. దీంతో కోర్టు కార్డియాలజిస్టు సిఫార్సు, వైద్యుల నివేదికను పరిశీలించారు. దీంతో ఆ దంపతుల సమ్మతితో ఎంటీపీ కు హైకోర్టు ఆగస్టు 7వ తేదీన అనుమతి ఇచ్చింది. దీంతో డాక్టర్లు ఆమెకు ఆగస్టు 8వ తేదీన అబార్షన్ చేపట్టారు. అయితే ఆ మహిళ ఓ సజీవ శిశువుకు జన్మనిచ్చింది.
తరువాత ఆగస్టు 9వ తేదీన బీఎంసీ న్యాయవాది పాటిల్ హాస్పిటల్ నివేదికను కోర్టుకు అందజేశారు. మహిళ ఆపరేషన్ కు తట్టుకుందని, అలాగే 484 గ్రాముల సజీవ శిశువుకు జన్మనిచ్చిందని తెలిపారు. ఆ శిశువు ఇప్పుడు ఎన్ఐసీయూలో ఉందని, తల్లి కూడా ఆరోగ్యంగానే ఉందని పేర్కొన్నారు. దీంతో తల్లి పూర్తిగా కోలుకునే వరకు హాస్పిటల్ లోనే ఉండాలని కోర్టు చెప్పింది. ఆ శిశువును డిశ్చార్జ్ చేయొచ్చని డాక్టర్లు చెప్పే వరకు తల్లిదండ్రులు కూడా తీసుకెళ్లేందుకు ప్రయత్నించకూడదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
