పేలిన బాయిలర్.. 100 మందికి గాయాలు
హరియాణాలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. రేవారీలో ఉన్న ఓ ఫ్యాక్టరీలోని బాయిలర్ పేలింది. ఈ ఘటనలో పలువురికి గాయాలు అయ్యాయి. అధికారులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు.
బాయిలర్ పేలి పలువురు కార్మికులకు గాయాలు అయ్యాయి. ఈ ఘటన హరియాణాలోని రేవారీలో చోటు చేసుకుంది. శనివారం రాత్రి 7 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సివిల్ సర్జన్ డాక్టర్ సురేందర్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ధారుహెరా ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని ‘హిందుస్థాన్ టైమ్స్’ పేర్కొంది.
ఈ ప్రమాదంపై సమాచారం అందగానే హాస్పిటల్స్ ను అలెర్ట్ చేశామని, ఫ్యాక్టరీకి అంబులెన్స్ పంపించామని సురేందర్ యాదవ్ అన్నారు. ఇప్పటి వరకు 100 మందికి గాయాలైనట్లుగా జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
‘లైఫ్ లాంగ్ ఫ్యాక్టరీలో రాత్రి 7 గంటల ప్రాంతంలో పేలుడు సంభవించింది. ట్రామా సెంటర్లోని వైద్యులను అప్రమత్తం చేశాం. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అవసరమైన ఏర్పాట్లు చేశాం’ అని రోమ్ తక్ లోని పీజీఐఎంఎస్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ఎస్ లోహ్చాబ్ తెలిపారు.
కాగా.. ఈ ఘటనా స్థలానికి అగ్నిమాపక యంత్రాలు, అంబులెన్సుల చేరుకున్నాయి. పోలీసులు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపడుతున్నారు.