బీహెచ్ యూ స్టూడెంట్ శివకుమార్ అదృశ్యం కేసుపై సీబీ సీఐడీ విచారణ జరిపింది. 2020 ఫిబ్రవరిలో పోలీసులు దహనం చేసిన మృతదేహం అతడిదే అని వారు విచారణలో తేల్చారు. తండ్రి డీఎన్ఏతో మృతుడి డీఎన్ఏ సరిపోలిందని పేర్కొంది.
మిస్టరీగా మారిన బీహెచ్ యూ స్టూడెంట్ అదృశ్యం కేసు ఓ కొలక్కి వచ్చినట్టు తెలుస్తోంది. 2020లో అతడు కనిపించకుండా పోయాడు. అయితే అదే ఏడాది ఓ గుర్తు తెలియని మృతదేహంగా గుర్తించి, దానిని యూపీ లోకల్ పోలీసులు దహనం చేశారు. అయితే ఆ మృతదేహం రెండేళ్ల కిందట కనిపించకుండా పోయిన 24 ఏళ్ల బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి చెందినదని ఉత్తరప్రదేశ్ పోలీసు క్రైమ్ బ్రాంచ్ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CB-CID) తన విచారణలో కనుగొంది.
మధ్యప్రదేశ్‌కు చెందిన శివ కుమార్ త్రివేది బనారస్ హిందూ యూనివర్సిటీలో BSc రెండో సంవత్సరం చదువుతున్నాడు. అయితే అతడు 2020 ఫిబ్రవరి 12వ తేదీన అదృశ్యమయ్యాడు. ఫిబ్రవరి 15న వారణాసిలోని రామ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సరస్సులో ఓ మృతదేహం బయటపడింది. తరువాతి రోజు బాధితుడి తండ్రి ప్రదీప్ కుమార్ త్రివేది (50) తన కుమారుడు తప్పిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఫిబ్రవరి 12న నగరంలో చివరిసారిగా కనిపించకుండా పోయిన విద్యార్థి అదృశ్యంపై లంక పోలీస్ స్టేషన్‌లో లెటర్-పిటీషన్‌ను అలహాబాద్ హైకోర్టు ఆగస్టు 20, 2020న పరిగణలోకి తీసుకుంది. ఈ కేసు దర్యాప్తును నవంబర్‌లో సీబీ సీఐడీకి హైకోర్టు బదిలీ చేసింది. అయితే అప్పటి నుంచి సీబీ సీఐడీ దీనిపై విచారణ జరుపుతోంది. తన విచారణలో లంక పోలీస్ స్టేషన్‌కు 5 కిలోమీటర్ల దూరంలోని సరస్సులో యువకుడి మృతదేహం లభ్యమైందని, దానిని క్లెయిమ్ చేయని మృతదేహంగా దహనం చేశారని కనుగొంది. CB-CID దర్యాప్తు అధికారులు మృతదేహాన్ని వెలికి తీసి, డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఆ మృతదేహం శివకుమార్ దే అని నిర్దారణ అయ్యింది.
శివ కుమార్ అదృశ్యమైన రోజు అతడిని లంక పోలీస్ స్టేషన్ కు తీసుకొని వచ్చినట్టు పోలీసులు తనకు తెలియజేయలేదని బాధితుడు తండ్రి సీబీ సీఐడీతో చెప్పారు. కాల్ రావడంతో తన కుమారుడిని లంక పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చినట్లు తెలిసిందని అన్నారు. ‘‘ బీహెచ్‌యూలోని యాంఫిథియేటర్ గ్రౌండ్ నుంచి కొంతమంది పోలీసు సిబ్బంది వచ్చి స్టేషన్ కు తీసుకెళ్లారు ’’ అని ప్రదీప్ అధికారులతో చెప్పారు.
ఈ కేసు విషయంలో హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదించిన అదనపు ప్రభుత్వ న్యాయవాది సయ్యద్ అలీ ముర్తాజా శుక్రవారం మాట్లాడుతూ.. “ ఒక సరస్సులో లభించిన క్లెయిమ్ చేయని మృతదేహాన్ని స్థానిక పోలీసుల దర్యాప్తు అధికారి పట్టించుకోలేదు. కానీ CB CID మృతదేహం నుంచి వెలికితీసిన దంతాలు, వెంట్రుకలపై DNA పరీక్షను నిర్వహించింది. తండ్రి రక్త నమూనాతో DNA సరిపోలింది.’’ అని చెప్పారు.
తప్పిపోయిన విద్యార్థి కుటుంబం తరపున వాదించిన న్యాయవాది సౌరభ్ తివారీ మాట్లాడుతూ.. ఈ విషయంలో పోలీసుల విచారణలో లోపం గురించి తాను అనేక ప్రశ్నలు లేవనెత్తానని చెప్పారు. అఫిడవిట్‌లో అతని వాదనలకు మద్దతు ఇచ్చే పత్రాలను సమర్పించాలని కోర్టు కోరిందని తెలిపారు. “నిగూఢమైన పరిస్థితుల్లో విద్యార్థి పోలీసు కస్టడీ నుంచి ఎలా అదృశ్యమయ్యాడని నేను కోర్టుకు వివరించాను. అలాగే విద్యార్థి కోసం వెతకడానికి పోలీసులు ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు వారు క్లెయిమ్ చేయని మృతదేహాల కోసం సమీపంలోని పోలీసు స్టేషన్‌లను ఎందుకు తనిఖీ చేయలేదని నేను న్యాయమూర్తులకు చెప్పాను. పోలీస్ స్టేషన్‌లో మూడు సీసీటీవీ కెమెరాలు పనిచేస్తున్నాయి కానీ ఆ రోజు కెమెరా పని చేయడం లేదని బాధితుడి తండ్రికి చెప్పారు.’’ అని ఆయన మీడియాతో వివరించారు. కాగా ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజేష్ బిందాల్, జస్టిస్ పీయూష్ అగర్వాల్ విచారించారు. తదుపరి విచారణను జూలై 14వ తేదీకి వాయిదా వేశారు.
