Mamata Banerjee: రాష్ట్రాల్లో ఎన్డీయేతర ప్రభుత్వాలను విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెనర్జీ అన్నారు. త‌న ప్రతిష్టను నాశనం చేయడానికి  ప్ర‌త్యేక ఎజెండాను సిద్ధం చేసుకున్న‌ద‌ని ఆరోపించారు.  

West Bengal: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ.. భార‌తీయ జ‌న‌తా పార్టీ నేతృత్వంలోని కేంద్రంపై విమ‌ర్శ‌ల‌తో విరుచుకుపడ్డారు. ఆమె స‌న్నిహితుడు, టీఎంసీ నాయ‌కుడు అనుబ్రతా మోండల్‌ను కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ (సీబీఐ) అరెస్టు చేయడం వెనుక కారణాల‌ను ప్రశ్నించారు. రాష్ట్రాల్లో ఎన్డీయేతర ప్రభుత్వాలను విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. 75వ స్వాతంత్య్ర‌ దినోత్సవం సందర్భంగా బెహలాలో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో మ‌మ‌తా పై వ్యాఖ్య‌లు చేశారు. “సాక్ష్యం లేకుండా, మీరు ఒక వ్యక్తిని ఎలా నిందిస్తారు” అంటూ ప్ర‌శ్నించారు. కేంద్రంలోని స‌ర్కారు రాజ‌కీయ క‌క్ష‌తో ముందుకు సాగుతున్న‌ద‌ని ఆరోపించారు. అలాగే, త‌న ప్ర‌తిష్ట‌ను నాశ‌నం చేయ‌డానికి ప్ర‌త్యేక ఎజెండా రూపొందించ‌బ‌డింద‌ని పేర్కొన్న మ‌మ‌తా బెన‌ర్జీ.. బీజేపీ తనను చూసి భయపడుతున్నందున ఆమెను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. 

ఏదైనా చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరిగితే చట్టం తన పని తాను చేసుకుంటుందని మ‌మ‌తా బెనర్జీ నొక్కిచెప్పారు, “కేష్టో (అనుబ్రతా మోండల్) ఎందుకు అరెస్టు చేశారు? అతను ఏమి చేశాడు?" పశువుల అక్రమ రవాణా కేసు విచారణకు సహకరించడం లేదనే ఆరోపణలతో మోండల్‌ను సీబీఐ అదుపులోకి తీసుకుంది. మోండల్ ఎమ్మెల్యే లేదా ఎంపీ కావడానికి ప్రతి ఆఫర్‌ను తిరస్కరించారని ఆమె అన్నారు. "నేను అతనిని రాజ్యసభకు వెళ్లమని కూడా అడిగాను, కానీ అతను ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించాడు. ఎవ‌రినైనా ల‌క్ష్యంగా చేసుకోవడానికి ఏజెన్సీలను ఉపయోగిస్తున్నారని" ఆమె ఆరోపించారు. 2024లో జ‌రిగే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ గెలవలేరని (తమకు తెలుసు) కాబట్టి ఇలా చేస్తున్నారు అని మ‌మ‌తా బెన‌ర్జీ అన్నారు. బెంగాల్‌లో టీఎంసీని బలహీనపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. “రాయల్ బెంగాల్ టైగర్ చూశారా? వచ్చి చూడండి అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన మ‌మ‌తా బెన‌ర్జీ.. తమ కార్య‌క‌ర్త‌ల‌ను ఇబ్బందుల‌కు గురిచేయ‌వ‌ద్దంటూ” పేర్కొన్నారు. 

"దేశంలో ఏ ప్రతిపక్ష శక్తి నిలబడకుండా ఉండటానికి వారు కొన్ని ఇతర పార్టీలకు చేసిన విధంగా వారు మమ్మల్ని కూడా ఇబ్బందుల‌కు గురిచేస్తున్నారు" అని మ‌మ‌తా బెనర్జీ అన్నారు. రాజకీయ వ్యక్తులనే కాకుండా అధికారులను కూడా సమన్ల ద్వారా బెదిరిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. "ఎనిమిది మంది అధికారులను ఢిల్లీకి పిలిపించార‌ని చెప్పిన ఆమె.. ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుందని" తెలిపారు. "నేను చనిపోతాను కానీ భయపడబోనని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చెప్పడానికి వచ్చాను... మేము పోరాడుతూనే ఉంటాము" అని నొక్కి చెప్పారు. జార్ఖండ్‌లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నాలను పశ్చిమ బెంగాల్‌లో పోలీసులు భగ్నం చేశారని ఆమె అన్నారు. "మేము వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాము. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు రూ.10 కోట్లు ఆఫ‌ర్ చేస్తున్నార‌ని" అని అన్నారు. జార్ఖండ్‌లోని ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ వాహనంలో దాదాపు రూ.49 లక్షల నగదుతో ఇటీవల అరెస్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అనైతికంగా పడగొట్టారని కూడా పేర్కొన్నారు. దేశంలోని సమాఖ్య నిర్మాణాన్ని బీజేపీ నాశనం చేసిందని ఆరోపించారు. 

‘‘బీజేపీ మీకు అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తున్నారు? సీబీఐ, ఈడీ మీపై ఎందుకు విచారణ జరపడం లేదు? అని ప్ర‌శ్నించారు. "నువ్వు సాధువు.. నేను దొంగనా?" తన ప్రభుత్వానికి లేదా పార్టీ నాయకులకు ట్యాగ్ చేయబడిన కొన్ని అవినీతి కేసులు లెఫ్ట్ ఫ్రంట్ కాలం నాటివని ఆరోపించిన మ‌మ‌తా బెన‌ర్జీ.. తాను మార్పుతీసుకురావ‌డానికి వ‌చ్చాన‌నీ, ప్ర‌తీకారం తీర్చుకోవ‌డానికి కాద‌ని అన్నారు. శారదా చిట్‌ఫండ్‌ కుంభకోణం లెఫ్ట్‌ ఫ్రంట్‌ హయాంలోనే ప్రారంభమైందని ఆమె పేర్కొన్నారు. పాఠశాల నియామకాల కుంభకోణంలో పార్థ ఛటర్జీ, పశువుల అక్రమ రవాణా కేసుకు సంబంధించి మోండల్‌ను ఇటీవల అరెస్టు చేయడంపై రాష్ట్రంలోని ప్ర‌తిప‌క్ష పార్టీలు టీఎంసీ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించిన సంగ‌తి తెలిసిందే.