దక్షిణాఫ్రికా, గ్రీస్ పర్యటన ముగించుకుని ప్రధాని మోడీ శనివారం ఉదయం బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా చంద్రయాన్ -3 విజయంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలను అభినందించారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ప్రసంగించారు.

చంద్రయాన్ -3లోని విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండ్ అయిన ప్రదేశానికి ‘శివశక్తి’ అని పేరు పెట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. ఇక నుంచి ఆగస్టు 23వ తేదీని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకుంటామని ప్రధాని ప్రకటించారు. చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ శనివారం బెంగళూరులో ఇస్రో శాస్త్రవేత్తలను కలిసి అభినందనలు తెలిపారు. దక్షిణాఫ్రికా, గ్రీస్ పర్యటన ముగించుకుని నేరుగా బెంగళూరు చేరుకున్న ప్రధాని.. ఉదయం 7.30 గంటలకు ఇస్రో శాస్త్రవేత్తలను కలిసి ప్రసంగించారు. 

అంతకు ముందు శాస్త్రవేత్తలు విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ గురించి ప్రధానికి వివరించారు. ఇస్రో శాస్త్రవేత్తలతో ముఖాముఖి సందర్భంగా భావోద్వేగానికి లోనైన ప్రధాని.. చంద్రయాన్-3 ల్యాండర్ ల్యాండ్ అయిన ప్రదేశాన్ని 'శివశక్తి'గా పిలుస్తామని ప్రకటించారు. ‘‘ఈ రోజు నేను వేరే స్థాయి ఆనందాన్ని అనుభవిస్తున్నాను, ఇలాంటి సందర్భాలు చాలా అరుదు. నేను దక్షిణాఫ్రికాలో ఉన్నానే కానీ.. నా మనస్సు మొత్తం మీతోనే ఉంది. వీలైనంత త్వరగా మిమ్మల్ని కలుసుకుని సెల్యూట్ చేయాలనుకున్నాను.’’ అని ఇస్రో శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రధాని అన్నారు. 

‘‘మీరు దేశాన్ని చాలా ఎత్తుకు తీసుకెళ్లారు. మీరు సాధించింది మాములు విజయం కాదు. భారత్ చంద్రుడిపై ఉంది. చంద్రుడిపై మన జాతీయ గౌరవాన్ని ఉంచాం. ఎవరూ వెళ్లని చోటుకు వెళ్లాం. ఇంతకు ముందెన్నడూ ఎవరూ చేయని పనిని మనం చేశాం. 2019లో చంద్రయాన్-2 తన ముద్రలను వదిలిన చంద్రుడిపై ఉన్న బిందువును 'తిరంగా' అని పిలవాలి. అలాగే ఆగస్టు 23వ తేదీని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకోవాలి’’ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. 

నేడు వాణిజ్యం నుంచి టెక్నాలజీ వరకు భారత్ మొదటి వరుసలో ఉన్న దేశాల్లో ఒకటిగా నిలుస్తోందని ప్రధాని అన్నారు. చంద్రయాన్ -3 విజయవంతంగా ల్యాండ్ కావడంలో మహిళా శాస్త్రవేత్తల పాత్రను ఆయన ప్రస్తావించారు. ‘‘మహిళలు ఇప్పుడు భారతదేశ శాస్త్రీయ ప్రయత్నాలకు నాయకత్వం వహిస్తున్నారు. చంద్రయాన్ -3లో మహిళా శాస్త్రవేత్తలు కీలక పాత్ర పోషించారు.’’ అని అన్నారు. ‘‘ఒకప్పుడు మమ్మల్ని మూడో వరుసలో లెక్కించేవారు. నేడు వాణిజ్యం నుంచి టెక్నాలజీ వరకు అభివృద్ధి చెందిన దేశాల్లో భారత్ మొదటి వరుసలో ఉంది. మూడో వరుస నుంచి మొదటి వరుసకు సాగే ఈ ప్రయాణంలో 'ఇస్రో' వంటి సంస్థలు గణనీయమైన పాత్ర పోషించాయి’’ అని ప్రధాని మోడీ అన్నారు.

భారత అంతరిక్ష పరిశ్రమ కొన్నేళ్లలో 8 బిలియన్ డాలర్ల నుంచి 16 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని నిపుణులు భావిస్తున్నారని ఇస్రో శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రధాని మోడీ అన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో భారత్ కచ్చితంగా గ్లోబల్ లీడర్ గా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సృజనాత్మక స్ఫూర్తి భారతదేశాన్ని కొత్త మరియు కొత్త శిఖరాలకు తీసుకువెళుతుంది, ఈ సృజనాత్మక స్ఫూర్తి 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.