రాబోయే తరానికి కొత్త ఆవిష్కరణలు, అవకాశాలను సృష్టించడమే లక్ష్యం - కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్
Rajeev Chandrasekhar : రాబోయే దశాబ్దానికి కొత్త ఆవిష్కరణలు, అవకాశాలను సృష్టించడం తమ లక్ష్యమని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాబ్రికేటర్ల కొరత ఉందని అన్నారు. 85,000 మంది ప్రతిభావంతులైన ఇంజనీర్లను సృష్టించడంపై దృష్టి పెట్టామని చెప్పారు.
Rajeev Chandrasekhar : న్యూఢిల్లీలో జరిగిన గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ 2023లో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే దశాబ్దానికి కొత్త ఆవిష్కరణలు, అవకాశాలను సృష్టించడం ఆశయమని అన్నారు. తాము పరిశోధన, ప్రతిభ, డిజైన్, ఫ్యాబ్రికేషన్‌ను చూస్తున్నామని చెప్పారు.
ప్రపంచ వ్యాప్తంగా ఫాబ్రికేటర్ల కొరత ఉందని రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. ఫ్యాబ్రికేషన్ కోసం 85000 మంది టాలెంట్ ఇంజినీర్లను తయారు చేసే దిశగా ముందుకు సాగుతున్నామని అన్నారు. తాము పరిశ్రమల కోసం పాఠ్యాంశాలను పునర్నిర్మించామని చెప్పారు. ‘‘మనది 120 బిలియన్ డాలర్ల మార్కెట్. మనకు భౌగోళిక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి. ప్రపంచంలోని అత్యుత్తమ దేశాలతో పోటీ పడాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.’’ అని అన్నారు. ఫాబ్రికేషన్ కోసం తాము ధీర్ఘకాలిక లక్ష్యాలను పెట్టుకున్నామని చెప్పారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పలు విషయాలను పంచుకున్నారు. తాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాని వల్ల కలిగే హాని గురించి చర్చించినప్పుడు, అనేక దేశాల ప్రభుత్వాలు దానిపై అతిగా స్పందించాయని అన్నారు. కానీ భారత్ తన వైఖరిని ఎప్పుడూ మార్చుకోలేదని తెలిపారు. వచ్చే దశాబ్దంలో ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి రంగాల్లో కృత్రిమ సాంకేతికత పెద్ద పాత్ర పోషిస్తుందని కేంద్ర మంత్రి అన్నారు. ‘‘సాంకేతికతను నియంత్రించడం గురించి మాట్లాడేటప్పుడు అక్కడ శూన్యత కనిపిస్తోంది. అయితే మనం దానిని నిజమైన సామర్థ్యంతో చూడాలి. 2021 నుంచొ మేము సాంకేతికతపై మా అభిప్రాయాలను బహిరంగ వేదికపై వ్యక్తం చేస్తున్నాము’’ అని అన్నారు.