పటీదార్ ఉద్యమనేత, గుజరాత్ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపేయినర్ హార్దిక్ పటేల్‌‌కు చేదు అనుభవం ఎదురయ్యింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతున్న అతడిపై ఓ వ్యక్తి దాడి చేశారు. అందరూ చూస్తుండగానే స్టేజీ పైకి ఎక్కి ప్రసంగిస్తున్న హార్దిక్ చెంప పగలకొట్టాడు. ఈ ఘటన గుజరాత్ లోని సురేంద్రనగర్ లో చోటుచేసుకుంది. 

హార్దిక్ పై దాడికి పాల్పడిన వ్యక్తిని తరుణ్ గజ్జర్ గా గుర్తించారు. కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడ్డ అతడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే హార్దిక్ పై దాడి చేసేంత పగను ఎందుకు పెంచుకున్నాడో గజ్జర్ మీడియాకు వివరించాడు.  

గుజరాత్ లో పటిదార్ ఉద్యమం ఉదృతంగా సాగుతున్న సమయంలో తన భార్య గర్భవతి వుండిందని గజ్జర్ తెలిపాడు. ఈ ఉద్యమం కారణంగా ఆమెను ట్రీట్ మెంట్ కోసం ఆస్పత్రికి తీసుకెళ్లడానికి చాలా ఇబ్బందులు పడ్డామని ఆవేదనతో వెల్లడించాడు. అప్పుడే దీనంతటికి కారణమైన వ్యక్తిపై దాడి చేసి బుద్ది చెప్పాలని నిర్ణయించుకున్నట్లు గజ్జర్ పేర్కొన్నాడు. 

ఆ తర్వాత కూడా పటిదార్ల నిరసన కారణంగానే తన చంటిబిడ్డకు మందులు కొనడానికి ఇబ్బంది పడ్డట్లు తెలిపాడు. అహ్మదాబాద్ లో వీరు ర్యాలీలు, నిరసనలు చేపడుతూ అన్ని షాపులను మూయించారని... అదే సమయంలో మందుల కోసం బయటకు వచ్చిన తాను ఇబ్బంది పడ్డట్లు వెల్లడించాడు. ఇలా అతడు తనకిష్టం వచ్చినప్పుడు రోడ్లపై నిరసనకు దిగుతూ బంద్ లకు పిలుపునిచ్చి గుజరాత్ లో అల్లకల్లోలం సృష్టించాడని ఆరోపించాడు. అతడిని గుజరాత్ హిట్లర్ తో పోలుస్తూ తరుణ్ గుజ్జర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
సురేంద్రనగర్‌లో హార్దిక్‌పై దాడి చేసిన వ్యక్తి వివరాలను  సురేంద్రనగర్ ఎస్సీ మహేంద్ర భగేడియా మీడియాకు తెలియజేశాడు. అతను ఏ పార్టీకి చెందిన వాడు కాదని, అతనో సాధారణ పౌరుడని తెలిపాడు. రాజకీయ కక్షతో ఈ దాడి జరగలేదని...వ్యక్తిగత కోపంతోనే అతడు దాడికి పాల్పడినట్లు తెలిపారు. చట్టానికి లోబడి అతడిపై తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.