భారత అంతరిక్ష చరిత్రలో సోమవారం మరో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. చందమామపై పరిశోధనల కోసం చంద్రయాన్ 2 ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ( ఇస్రో) శ్రీహరి కోట నుంచి విజయవంతంగా ప్రయోగించింది. 20గంటల కౌంట్ డౌన్ అనంతరం 3.8టన్నుల బరువైన చంద్రయాన్ 2 ఉపగ్రహంతో మధ్యాహ్నం 2.43 నిమిషాలకు నింగికి ఎగిసింది. చంద్రయాన్ 2 విజయవంతం కావడం పట్ల సర్వత్రా ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి.

కాగా... ఈ ఘనత సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీలు అభినందనలు తెలిపారు. చంద్రయాన్ 2 ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయమని మోదీ పేర్కొన్నారు. దీనిని కేవలం మన దేశీయులు మాత్రమే పూర్తి చేశారని మోదీ పేర్కొన్నారు. శాస్త్రవేత్తల అంకిత భావం, కృషి ఈ విజయానికి కారణమని మోదీ అన్నారు.

చంద్రయాన్ 2 భావితరాలకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందని మోదీ పేర్కొన్నారు. ఈ విజయం తర్వాతి తరాలవారికి సైన్స్ పై ఇష్టం పెరిగేలా చేస్తుందని చెప్పారు. చంద్రయాన్ కి ఈ సందర్భంగా మోదీ దన్యవాదాలు తెలిపారు. భారతదేశానికి గుర్తింపు తీసుకువచ్చిందని... చంద్రునిపై మనకున్న జ్ఞానం మరింత పెరుగుతుందని మోదీ ఈ సందర్భంగా ట్విట్టర్ లో పేర్కొన్నారు.

అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... ఏపీ ముఖ్యమంత్రి జగన్ లు కూడా చంద్రయాన్ 2 విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దీనిని విజయవంతం చేసిన శాస్త్రవేత్తలకు దన్యవాదాలు తెలిపారు.