టిక్ టాక్ లో ఆమెకు అతను పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. తన ప్రేమ తో అతడిని గెలవాలని అనుకుంది. కానీ అతను అంగీకరించలేదు. ఎలాగైనా తన ప్రేమను నిరూపించుకోవాలని అనుకుంది. ఈలోపే  కరోనా లాక్ డౌన్ వచ్చిపడింది. అయితే.. ఈ లాక్ డౌన్ లోనూ తమ ప్రేమను ఎవరూ విడదీయలేరు అని ఆ యువతి భావించింది. అంతే.. నడుచుకుంటూనే 200కిలోమీటర్ల దూరం నడిచి తన ప్రియుడిని చేరుకుంది. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తంజావూరు ప్రాంతానికి చెందిన యువతికి  టిట్‌టాక్‌ ద్వారా మదురై ఆరపాలయంకు చెందిన యువకుడితో పరిచయమైంది. ఆమె.. అతడిని వన్‌సైడ్‌గా ప్రేమించింది.ఈ విషయం తెలుసుకున్న ఆ యువకుడు ఆమెతో టిట్‌టాక్‌ చేయడం ఆపేశాడు. అయినా ఆమె మాత్రం అతనిపై ప్రేమను పెంచుకుంది. 

కరోనా వైరస్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌తో 144 సెక్షన్‌ అమలులో ఉన్నా.. ఆ యువకుడిని చూడడానికి ఆమె మదురైకు నడిచి వస్తున్నట్టు టిక్‌టాక్‌ ద్వారా వీడియో పెట్టింది. తంజై నుంచి మదురైకి సుమారు 200 కిలోమీటర్ల దూరం ఉంది. ఒంటరిగా నడిచి వస్తూ,ప్రేమ పాటలు పాడుతూ..ఏ ప్రాంతంలో ఉందో తెలిసే విధంగా వీడియో ద్వారా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టింది. 

సోమవారం మధ్యాహ్నం ఆమె మదురై జిల్లా మేలూర్‌ సమీపంలో నడిచి వస్తున్నానని... తనను బైక్‌లో తీసుకు వెళ్లాలని ఆ యువకుడిని కోరింది. ఈ వీడియోలను చూసిన నెటిజన్లు ఆమెకు సూచనలు ఇస్తుండగా, కొందరు ఆమెను దూషిస్తూ పోస్టులు పెట్టారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది