జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఆర్మీ వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకుని బాంబు దాడికి పాల్పడ్డారు. 44 రాష్ట్రీయ చెందిన సైనికులు పెట్రోలింగ్‌కు వెళుతున్నారు. ఈ క్రమంలో పుల్వామా జిల్లా అరిహల్‌ సమీపానికి రాగానే ఉగ్రవాదులు శక్తివంతమైన ఐఈడీని పేల్చారు.

ఈ దాడిలో తొమ్మిది మంది భద్రతా సిబ్బంది, ఇద్దరు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. ఫిబ్రవరి 14న ఓ సూసైడ్ బాంబర్ 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న ప్రాంతానికి ఇది కేవలం 27 కిలోమీటర్ల దూరంలోనే తాజా ఘటన జరగడం గమనార్హం.

కాగా సైనికుల వాహనం బుల్లెట్, మైన్ ప్రూఫ్ కావడంతో పెను ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు. అనంతరం పరిస్ధితిని అదుపులోకి తీసుకురావడానికి మరికొంత మంది సిబ్బందిని రప్పించి.. గాల్లోకి కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు.