జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదం త్వరలోనే అంతమవుతుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఉగ్రవాదం చివరి దశలో ఉందని స్పష్టం చేశారు. రాహుల్ భట్ హత్య పట్ల విచారం వ్యక్తం చేశారు. 

జమ్మూకాశ్మీర్లో మూడు దశాబ్దాల పాటు కొనసాగిన ఉగ్రవాదం చివరి దశలో ఉందని, ఈ ప్రాంతంలో సాధారణ పరిస్థితులు వేగంగా తిరిగి వస్తున్నాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. కథువా జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. లోయలోని బుద్గామ్ జిల్లాలో ఉగ్రవాదులు కాశ్మీరీ పండిట్ రాహుల్ భట్‌ను హతమార్చడాన్ని సమర్థించలేమని అన్నారు. ఆయ‌న హ‌త్య‌పై విచారం వ్య‌క్తం చేశారు. 

Rahul Gandhi: "ప్రధానమంత్రి గారూ.. భద్రత క‌ల్పించండి": రాహుల్ గాంధీ

చదూరా తహసీల్ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న భట్ గురువారం జమ్ముకశ్మీర్ లోని బుద్గాం జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన లక్షిత హత్యలో హతమయ్యాడు. ఈ సంఘటన లోయలో విస్తృత నిరసనకు దారితీసింది, లోయలో తాము సురక్షితంగా లేమని చాలా మంది కాశ్మీర్ పండిట్లు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. భట్ హత్య జరిగిన మరుసటి రోజే కశ్మీరీ పండిట్లందరూ 350 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామా చేశారు.

Rahul Gandhi: కాశ్మీర్ నుంచి క‌న్యాకుమారి వ‌ర‌కు రాహుల్ గాంధీ పాద‌యాత్ర !

రాహుల్ భ‌ట్ మృతి పెద్ద‌ నష్టమని, ఆయన నిష్క్రమణ వల్ల ఏర్పడిన శూన్యతను పూడ్చలేమని కేంద్ర మంత్రి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గల్లంతైన లింకులను అడ్మినిస్ట్రేష‌న్ పరిశీలిస్తుందని, వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయానికి సంబంధించిన ఏవైనా లోపాలను పరిష్కరిస్తుందని చెప్పారు. జమ్మూ కాశ్మీర్ పరిపాలనకు కేంద్ర ప్రభుత్వం, ప్రత్యేకించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుండి తగిన సహకారం ల‌భిస్తుంద‌ని తెలిపారు.

‘‘ మేము శ్రీనగర్‌లో ఉన్నాము. పర్యాటక అభివృద్ధిని చూశాము. జమ్మూ, కాశ్మీర్‌లో పరిస్థితి వేగంగా సాధారణ స్థితికి వస్తోంది, అయితే ఇది తమ రాజకీయాలపై ప్రభావం చూపుతుందని భావించే కొంతమంది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్పడుతున్నారు.’’ అని జితేంద్ర సింగ్ ఆరోపించారు. భట్ హత్యపై రాజకీయ నాయకులు గత రెండు రోజులుగా ప్రకటనలు ఇచ్చారని, అయితే ఒక్కసారి కూడా పాకిస్తాన్‌గానీ, ఉగ్రవాదుల పేరు ప్ర‌స్తావించ‌లేద‌ని ఆయ‌న అన్నారు. 

Hindi row: "వాళ్లెందుకు పానీ పూరీ అమ్ముతారు?".. తమిళనాడు విద్యాశాఖ మంత్రి వ్యాఖ్య‌లు వివాదాస్పదం

‘‘ ఉగ్రవాదిని ఉగ్రవాది అని పిలవడానికి వెనుకాడేవారు ఉన్నత నైతికత విషయం మాట్లాడకూడదు.. అంటే వారు తమను తాము, ప్రజలను మోసం చేసుకుంటున్నారని అర్థం’’ అని కేంద్ర మంత్రి అన్నారు. ఉగ్రవాదాన్ని పిలవడంలో ధైర్యం అవసరమని తెలిపారు. ‘‘ ఇది మన సమాజ బలం. జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదానికి ఇది చివరి దశ అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను ’’ అని ఆయన అన్నారు. రాబోయే అమర్‌నాథ్ యాత్రకు భద్రతా ఏర్పాట్ల విషయంలో మీడియా అడిగిన ప్రశ్నకు ఆయ‌న సమాధానమిస్తూ.. జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేష‌న్ తో క‌లిసి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రణాళికలను రూపొందిస్తోందని జితేంద్ర సింగ్ చెప్పారు.