ఢిల్లీ ఎయిర్‌పోర్టులో టెర్మినల్ కూలిపోవడానికి కారణమదే.. క్లారిటీ ఇచ్చిన కేంద్రమంత్రి రామ్మోహన్
ఢిల్లీ ఎయిర్ పోర్టులో ప్రమాదం జరిగింది. గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి శుక్రవారం తెల్లవారుజామున టెర్మినల్-1 పైకప్పు కూలింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు బాధితులకు పరిహారం ప్రకటించారు.
దేశ రాజధానిలో దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో టెర్మినల్-1 పైకప్పు కొంత భాగం కూలిపోయింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి టెర్మినల్-1లో శ్లాబ్ కూలి... కార్లపై పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటనతో ఢిల్లీ ఎయిర్ పోర్టు పరిసరాల్లో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. హుటాహుటిన స్పందించిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తక్షణమే స్పందించారు. అధికారులతో కలిసి ఎయిర్ పోర్టుకు చేరుకొని పరిశీలించి.. సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ ఘటనపై దర్యాప్తునకు అధికారులను ఆదేశించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు... ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి తక్షణమే రూ.20 లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.3లక్షల చొప్పున పరిహారమిస్తామని తెలిపారు. ఎయిర్ పోర్టులో కూలింది పాత టెర్మినల్ అని.. దాన్ని 2009లో ప్రారంభించారని తెలిపారు. ప్రధాని మోదీ ఇటీవల ప్రారంభించిన టెర్మినల్.. కూలిపోయిన దానికి అవతలివైపు ఉంటుందని స్పష్టం చేశారు.
కాగా, ఢిల్లీ విమానాశ్రయంలో టెర్మినల్ పైకప్పు కూలిన ఘటనపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. ప్రధాని మోదీ ఇటీవల ప్రారంభించిన టెర్మినల్ కూలిపోవడమేంటని విస్మయం వ్యక్తం చేశారు. మోదీ పాలనలో అవినీతికి ఈ ఘటనే నిదర్శనమంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంకాగాంధీ ఆరోపించారు. కాంగ్రెస్ నేతల విమర్శలను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఖండించారు.
టెర్మినల్-1 కూలిపోయిన నేపథ్యంలో మధ్యాహ్నం 2గంటలకు ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి విమానాల రాకపోకలు నిలిపివేశారు. దీంతో అసౌకర్యానికి గురైన ప్రయాణికులకు రీఫండ్ లేదా మరో ఫ్లైట్ బుక్ చేసుకొనే అవకాశమిచ్చినట్లు కేంద్ర విమానయాన శాఖ తెలిపింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత టెర్మినల్-2, టెర్మినల్-3 నుంచి విమానాల రాకపోకలు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది.