ఘట్ కేసర్ విద్యార్థి అత్యాచారం డ్రామా లాంటి కేసే తాజాగా కర్ణాటకలో మరొకటి వెలుగు చూసింది. ఈ కేసులో అమ్మాయి టెన్త్ క్లాస్ స్టూడెంట్. హోం వర్క్ నుండి తప్పించుకునేందుకు, కిడ్నాప్, రేప్ డ్రామాకు తెరతీసిందో స్టూడెంట్.  కర్ణాటకలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 

ఉత్తర కన్నడ జిల్లాలోని యల్లాపుర తాలూకా నందొళ్లి గ్రామానికి చెందిన టెన్త్ క్లాస్ స్టూడెంట్ గత బుధవారం స్కూల్ కి వెళ్లి తిరిగి రాలేదు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు భయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అదే రోజు రాత్రి నందొళ్లి గ్రామానికి దగ్గర్లో ఉన్న అడవిలో తాళ్లతో బంధించిన స్థితిలో బాలికను గుర్తించారు. 

వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. అయితే ఆ అమ్మాయి తననెవరో ముగ్గురు దుండగులు కిడ్నాప్ చేశారని, అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపింది. వెంటనే వైద్యపరీక్షలు నిర్వహించగా అది అబద్దమని తేలిసింది. 

దీంతో పోలీసులు, తల్లిదండ్రులు గట్టిగా మందలించడంతో నిజాలు వెల్లడించింది. హోంవర్క్ చేయలేదని అందుకే అత్యాచారం, కిడ్నాప్ డ్రామా ఆడినట్లు తెలిపింది. దీంతో తల్లిదండ్రులు, టీచర్లు ఊపిరిపీల్చుకున్నారు. దీనిమీద యల్లాపుర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.