మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు పశ్చిమ బెంగాల్‌లో కలకలం రేపుతున్నాయి. బీజేపీ నేత నుపుర్ శర్మను అరెస్టు చేయాలంటూ బెంగాల్‌లో ముస్లింలు పెద్ద ఎత్తున శుక్రవారం ఆందోళనలకు దిగారు. ఈ రోజు హౌరా జిల్లాలో జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. నిరసనకారులు పోలీసులపై రాళ్లు విసిరారు. పరిస్థితులను అదుపులోకి తేవడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
కోల్‌కతా: బీజేపీ నేత నుపుర్ శర్మ మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు రాజేసిన మంటలు ఇంకా చల్లారడం లేదు. ఈ మంటలు పశ్చిమ బెంగాల్‌ను సైతం అట్టుడికిస్తున్నాయి. శుక్రవారం పెద్దమొత్తంలో ముస్లింలు ప్రేయర్‌కు హాజరై నుపుర్ శర్మను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనలు చేశారు. ముఖ్యంగా హౌరా జిల్లాలో నిరసనకారులు రోడ్లను దిగ్బంధించారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈ వాయిలెన్స్‌కు సంబంధించి నిన్న రాత్రి నుంచి పోలీసులు సుమారు 70 మందిని అరెస్టు చేశారు. ఉలుబేరియా సబ్ డివిజన్‌లో 144 సెక్షన్ విధించారు. ఈ చర్యలను జూన్ 15వ తేదీ వరకు పొడిగించారు.
ఇదిలా ఉండగా, శనివారం మళ్లీ ఆందోళనలు జరిగాయి. హౌరాలోని పంచలా బజార్‌లో ఈ ఆందోళనలు మొదలయ్యాయి. ఆందోళనలను అదుపులో ఉంచడానికి పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే నిరసనకారులు పోలీసులపైకి రాళ్లు విసిరారు. దీంతో ఆందోళనలను అదుపు చేయడానికి, నిరసనకారులను చెల్లాచెదురు చేయడానికి పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు.
ఈ ఘటనలపై సీఎం మమతా బెనర్జీ స్పందించారు. తాను ఇది వరకే చెప్పినట్టుగా హౌరా జిల్లాలో రెండు రోజులుగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని ఆమె ట్వీట్ చేశారు. ఈ ఘటనల వెనుక కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయని ఆరోపించారు. అవి రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని ప్రయత్నిస్తున్నాయని వివరించారు. కానీ, ఈ చర్యలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. అల్లర్లకు కారణమైన వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బీజేపీ పాపానికి ప్రజలు ఎందుకు బాధపడాలి? అని ప్రశ్నించారు.
ఇదిలా ఉండగా, బీజేపీ ఎంపీ, పశ్చిమ బెంగాల్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ సౌమిత్రా ఖాన్ రాష్ట్రంలో శాంతి భద్రతల కోసం చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రవక్తపై వ్యాఖ్యల కారణంగా ఆందోళనలు జరుగుతుండటంతో వాటిని అడ్డుకునే క్రమంలో పలుచోట్ల ఇంటర్నెట్ సేవలు రద్దు చేయడం, కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. అందుకే కేంద్ర బలగాలను రాష్ట్రంలోకి దింపి సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కోరారు.
