Asianet News TeluguAsianet News Telugu

Udaipur Murder Case: ఉదయపూర్ లో టెన్ష‌న్.. టెన్షన్.. రంగంలోకి NIA.. తాజా అప్‌డేట్‌లు ఇవిగో..

Udaipur Murder Case: రాజస్థాన్‌లోని ఉదయపూర్ జిల్లాలో జ‌రిగిన మారణకాండతో రాష్ట్ర‌వ్యాప్తంగా టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఈ క్ర‌మంలో ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా..పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ప‌లు చోట్ల క‌ర్య్ఫూ విధించారు. ఇంట‌ర్ నెట్ సేవ‌ల‌ను నిలిపివేశారు. రాజస్థాన్ పోలీసులు కేవ‌లం 5 గంటల్లో హంతకులను పట్టుకున్నారు. 
 

Tension In Udaipur Over Tailor's Brutal Murder. 2 Held, Curfew Imposed, NIA Team Dispatched
Author
Hyderabad, First Published Jun 28, 2022, 11:07 PM IST

Udaipur Murder Case: మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన బీజేపీ నేత‌ల‌కు సోష‌ల్ మీడియాలో మ‌ద్ద‌తు తెలిపిన ఓ వ్య‌క్తిని ఇద్ద‌రు దుండ‌గులు అత్యంత దారుణంగా త‌ల న‌రికి..  హత్య చేశారు. పైగా ఆ దారుణహత్యకు పాల్పడింది తామేనంటూ నిందితులు సోషల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించారు. రాజ‌స్థాన్ లోని ఉద‌య్‌పూర్ లో చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న.. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ ఘ‌ట‌న‌తో ఒక్క‌సారిగా..  రాష్ట్రంలో ఉద్రిక్త‌త వాతావ‌రణం నెల‌కొంది. 

ఈ క్ర‌మంలోనే అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు.. ఆయా ప్రాంతాల్లో చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఈ ఘటనకు పాల్ప‌డిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ప‌రిస్థితులు మ‌రింత దిగ‌జార‌కుండా ఉండేందుకు 24 గంట‌ల పాటు ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను నిలిపివేశారు. ఉదయపూర్‌లోని కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. ప్ర‌జ‌లు శాంతికి భంగం క‌లిగించ‌కుండా ఓపిక‌తో ఉండ‌లంటూ ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్.. పిలుపునిచ్చారు.
 
ఉదయపూర్ టెన్షన్: తాజా అప్‌డేట్‌లు ఇవిగో..

> మృతుడు కన్హయ్యా లాల్ ఉదయ్‌పూర్‌లోని ధన్‌మండిలో టైలర్ గా పనిచేస్తూ.. జీవ‌నం సాగిస్తున్నారు. మంగ‌వారం నాడు మ‌ధ్యాహ్నాం ప్రాంతంలో ఇద్దరు దుండ‌గులు కస్టమర్లుగా నటిస్తూ.. అత‌ని టైల‌ర్ షాప్ లోకి ప్రవేశించారు. 

> కన్హయ్యా లాల్ ఒకరికి కొలతలు తీస్తుండగా.. మ‌రో వ్య‌క్తి అత‌డిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘ‌ట‌న‌ను మరో వ్యక్తి తన మొబైల్‌తో చిత్రీకరించాడు. కన్హయ్యలాల్ శరీరంపై కూడా పలు కత్తిపోట్లు కనిపించాయని IANS నివేదించింది.

> ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన వీడియో క్లిప్‌లో.. దుండగుల్లో ఒకరు ఆ వ్యక్తిని తల నరికి చంపారని, ఈ క్ర‌మంలో ప్రధాని నరేంద్ర మోడీని కూడా బెదిరించిన‌ట్టు క‌నిపిస్తుంది.  

> కన్హయ్యాలాల్ 10 రోజుల క్రితం.. నుపుర్ శర్మకు అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అప్పటి నుంచి ఓ వర్గానికి చెందిన వ్యక్తులు అతడిని చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. కానీ, పోలీసులు దీనిని సీరియ‌స్ గా తీసుకోలేదు. ఈ క్ర‌మంలో అత‌డు వారం రోజుల పాటు.. త‌న షాపును క్లోజ్ చేసే ఉంచి.. ఈ రోజే తెరిచారు.  

> హ‌త్య‌కు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో.. స్థానిక మార్కెట్లలోని దుకాణదారులు షట్టర్లను దించి నిరసనకు దిగారు. దర్జీ మృతదేహాన్ని పోలీసులు తీసుకెళ్లకుండా దుకాణదారులు అడ్డుకుని, హంతకులను అరెస్టు చేసి రూ.50 లక్షల పరిహారం, బాధిత కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

> నిందితులను సూరజ్‌పోల్‌కు చెందిన గౌస్‌ మహ్మద్‌, రియాజ్‌గా గుర్తించారు. వీరిద్దరూ మోటార్‌సైకిల్‌పై పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని, ముఖాలు క‌నిపించ‌కుండా హెల్మెట్‌లు ధరించారని పోలీసులు తెలిపారు.

> ఈ ఘ‌ట‌న‌పై విచారణ చేయ‌డానికి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బృందాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు తరలించినట్లు ANI నివేదించింది. NIA బృందాన్ని ఉదయపూర్‌కు పంపడానికి సన్నాహాలు జరిగాయి. రేపు ఉదయానికి 5 మంది అధికారులు ఉదయపూర్ చేరుకుని విచారణ ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు.

> ఈ ఊచకోత తర్వాత పోలీసులపై ప్రజల్లో ఆగ్రహం కనిపిస్తోంది. ఉదయ్‌పూర్‌లో పోలీసులపై రాళ్ల దాడి, పోలీసు వాహనాలను ధ్వంసం చేసినట్లు వార్తలు వచ్చాయి. పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ప‌రిస్థితి చేదాటిపోకుండా.. ఉదయ్‌పూర్‌లోని ఏడు పోలీసు స్టేషన్‌ల పరిధిలో కర్ఫ్యూ విధించారు. ధన్ మండి, ఘంటా ఘర్, హాతీ పోల్, అంబా మాతా, సూరజ్ పోల్, భూపాల్‌పురా, సవినా ప్రాంతాల్లో క‌ర్ఫ్యూ కొన‌సాగుతోంది. 

> ఘటన తర్వాత విడుదలైన వీడియోలను వైరల్ చేయవద్దని రాజస్థాన్ ప్రభుత్వం కఠినమైన ఆదేశాలు ఇచ్చింది. వైరల్ చేసే వారిపై కఠిన చర్యలకు సిద్ధమైంది. ఇదే క్ర‌మంలో ఉదయపూర్‌లో మొబైల్ ఇంటర్నెట్ కూడా నిలిపివేయ‌బడ్డాయి.రాష్ట్ర స్థాయి హెచ్చరిక జారీ చేయబడింది. ముందుజాగ్రత్త చర్యగా పెట్రోలింగ్, ఫోర్స్ మొబిలిటీని పెంచాలని రేంజ్ ఐజిలు, ఎస్పీలను కోరామని లా అండ్ ఆర్డర్ ADG హవా సింగ్ ఘుమారియా తెలిపారు.

> రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శాంతి భద్రతలను కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వీడియోలను షేర్ చేయవద్దని కోరారు. దోషులను విడిచిపెట్టబోమని, మొత్తం పోలీసు బృందం పూర్తి అప్రమత్తతో పని చేస్తోంది. హత్య కారణంగా ప్రజల్లో ఎంత ఆగ్రహావేశాలు ఉందో ఊహించగలను. తదనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అరెస్టు చేసిన నిందుతుల‌ను ఎక్క‌డికి త‌ర‌లించారో గోప్యంగా ఉంచారు.  

> ఈ ఘ‌ట‌న‌పై  రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ స్పందించారు. ఈ హత్యాకాండ చాలా క్రూరమైనదని ట్వీట్ చేశారు. ఢిల్లీ నుండి గ‌ల్లీ వ‌ర‌కు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై దాడి చేశారు. భ‌ద్ర‌తా లోపాన్ని ఎత్తి చూపించారు.ఈ క్ర‌మంలో భారీ మొత్తంలో బ‌ల‌గాల‌ను మోహ‌రించారు. రాష్ట్రంలో ఐపిఎస్ స్థాయి నుండి కానిస్టేబుల్ స్థాయి వరకు పోలీసుల సెలవులు ర‌ద్దు చేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే ఎలాంటి సెల‌వులు తీసుకోవ‌ద్దని ప్ర‌భుత్వం ఉత్త‌ర్వుల్లో పేర్కొంది.

Follow Us:
Download App:
  • android
  • ios