Asianet News TeluguAsianet News Telugu

మహారాష్ట్రలో ఉద్రిక్తత.. కిరాద్‌పురా రామమందిరం వెలుపల ఇరువర్గాల రాళ్ల దాడి.. వాహనాలకు నిప్పుపెట్టిన దుండగులు..

మహారాష్ట్రలోని కిరాద్ పురా ప్రాంతంలో ఉన్న ఓ రామ మందిరం వెలుపల రెండు వర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. దుండగులు అక్కడున్న వాహనాలకు కూడా నిప్పుపెట్టారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలొకొన్నాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు. 

Tension in Maharashtra.. Outside the Kiradpura Ram temple, stone pelting by both sides.. Miscreants set vehicles on fire..ISR
Author
First Published Mar 30, 2023, 10:14 AM IST

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ లోని కిరాద్ పురా ప్రాంతంలో బుధవారం రాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రామమందిరం వెలుపల రెండు వర్గాలకు చెందిన వ్యక్తులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. దీంతో పాటు అక్కడున్న అనేక వాహనాలకు నిప్పుపెట్టారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బలప్రయోగం చేశారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. దుండగులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఛత్రపతి శంభాజీనగర్ సీపీ నిఖిల్ గుప్తా హామీ ఇచ్చారు.

బాంబే కోర్టులో మమత బెనర్జీకి చుక్కెదురు.. అసలేం జరిగింది?

మతపరమైన నినాదాలు చేసే విషయంలోనే రెండు గ్రూపుల యువకుల మధ్య ఘర్షణ జరిగిందని నివేదికలు చెబుతున్నాయని ‘టైమ్స్ నౌ’ కథనం పేర్కొంది. దీంతో  కిరాద్ పురా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా.. ఈ ఘర్షణ వల్ల రామ మందిరానికి ఎలాంటి నష్టమూ జరగలేదని ఎంఐఎం కార్పొరేటర్ మహ్మద్ నసీరుద్దీన్ ఓ వీడియో విడుదల చేశారు. అందులో ఔరంగాబాద్ ఎంపీ ఇంతియాజ్ రామమందిరం లోపలికి వెళ్లి అక్కడి పరిస్థితిని వివరించారు. అందులో ‘‘కొంతమంది దుండగులు ఆలయంపై దాడి చేశారని కొన్ని తప్పుడు వార్తలు వ్యాప్తి చేశారు. కానీ నిజానికి అలాంటిదేమీ జరగలేదు. నేను ప్రస్తుతం రామ మందిరం లోపలే ఉన్నాను. గుడికి ఎలాంటి హానీ జరగలేదు. వదంతులను నమ్మొద్దు. దయచేసి శాంతిని కాపాడండి’’ అని ఆయన ఇరువర్గాలకు విజ్ఞప్తి చేశారు.

హిందూ సోదరులకు శ్రీరామనవమి ఒక ముఖ్యమైన పండుగ అని ఇంతియాజ్ జలీల్ అన్నారు. ఈ నగర ప్రజలు అన్ని పండుగలను కలిసి జరుపుకుంటారని చెప్పారు. శాంతికి విఘాతం కలిగించేందుకు కొందరు సంఘ విద్రోహ శక్తులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ ఘటనలో రామ మందిరానికి, పూజారులకు ఎలాంటి హానీ జరగలేదని, ఇతర సేవలకులు కూడా సురక్షితంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.

‘‘ఈ దుండగులు మాదకద్రవ్యాలకు బానిసలు. ఏయే వాహనాలు దగ్ధమయ్యాయో కూడా వారికి తెలియదు. కూంబింగ్ చేపట్టాలని పోలీసులను కోరుతున్నాను. అలాగే దోషులందరినీ శిక్షించాలని, సీసీ కెమెరాలను తనిఖీ చేయాలి.’’ అని ఎంపీ  తెలిపారు. కాగా ఈ ఘటనపై సీపీ నిఖిల్ గుప్తా మాట్లాడుతూ.. ‘‘ఛత్రపతి శంభాజీనగర్ లోని కిరాద్ పురా ప్రాంతంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. కొన్ని ప్రైవేట్, పోలీసు వాహనాలకు నిప్పుపెట్టారు. ప్రజలను చెదరగొట్టేందుకు పోలీసులు బలప్రయోగం చేయడంతో ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉంది. దుండగులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని అన్నారు. గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios