గ్రేటర్ నోయిడాలో ఓ ఫ్లాట్‌ను 11 నెలలు లీజుకు తీసుకున్న మహిళ చివరకు లీజు గడువు ముగిసినా అందులోనే కొనసాగుతున్నారు. ఫ్లాట్ ఖాళీ చేయాలని రెండు నెలల ముందే గుర్తు చేసినా ఆమె పట్టించుకోలేదు. అసలు ఆ ఫ్లాట్‌కు తానే ఓనర్ అని ఏకంగా ఓనర్లతోనే చెప్పడం గమనార్హం.
లక్నో: ఉత్తరప్రదేశ్‌కు చెందిన సునీల్ కుమార్, రాఖీ గుప్తా దంపతులకు గ్రేటర్ నోయిడా సెక్టార్ 16బీలోని శ్రీ రాధా స్కై గార్డెన్ సొసైటీలో 15వ ఫ్లోర్‌లో ఫ్లాట్ ఉన్నది. ఆ ఫ్లాట్‌ను ప్రీతి అనే 35 ఏళ్ల మహిళకు 2021 జులైలో 11 నెలల లీజుకు ఇచ్చారు. ఈ లీజు గత నెలతో ముగిసింది. ఆ ఫ్లాట్ ఖాళీ చేయాలని, తాము ఆ ఫ్లాట్‌లోకి షిఫ్ట్ కావాలనుకుంటున్నట్టు ఓనర్లు అద్దెకు ఉన్న ప్రీతికి తెలిపారు. రెండు నెలల ముందే ఈ సమాచారం ఇచ్చారు. కానీ, ఆమె పట్టించుకోలేదు. సరికదా.. ఓనర్లు అక్కడకు వస్తే.. వారికే మంచి అద్దె గది చూసిపెడతానని చెప్పడంతో వారు ఖంగుతిన్నారు. దీంతో నోయిడాకు వచ్చిన ఆ ఫ్లాట్ ఓనర్లు అపార్ట్‌మెంట్‌లోని మెట్ల మీదే గడపాల్సి వస్తున్నది.
తాము మే నెలలోనే ఆమెకు రిమైండర్ పంపామని, ఆ ఫ్లాట్ ఖాళీ చేయాలని చెప్పామని, కానీ ఆమె వినలేదని ఓనర్లు చెప్పారు. అంతేకాదు, అక్కడికి వస్తే.. మరో ఇంటిని అద్దెకు వెతికిపెడతానని వారికి చెప్పిందని పేర్కొన్నారు. వారు ఇచ్చిన లీజు గడువు కూడా ముగిసింది. కానీ, ఆమె ఫ్లాట్ ఖాళీ చేయడం లేదు.
తాము లీజుకు సంబంధించిన ప్రతిదానిని పద్ధతిగా ఫాలో అయ్యామని, రెండు నెలలు ముందగానే ఆమెకు రిమైండర్ పంపామని సునీల్ కుమార్ చెప్పారు. అందుకు ఆమె తొలుత సరేనని, ఆ తర్వాత ప్లేటు ఫిరాయించిందని పేర్కొన్నారు. ఆమె సరే అనడంతో తాము నేరుగా ముంబయి నుంచి ఇక్కడకు వచ్చేశామని వివరించారు.
సరే అని చెప్పిన గంటల వ్యవధిలోనే మమ్మల్ని ఆ ఫ్లాట్‌లోకి రానివ్వనని మెస్సేజీ పెట్టిందని సునీల్ కుమార్ చెప్పారు. అంతేకాదు, ఆ ఫ్లాట్ ఓనర్ తానేనని చెబుతుండటం తనను బాధించిందని పేర్కొన్నారు. బహుశా ఆ టెనంట్ కొన్ని నకిలీ ధ్రువ పత్రాలు తయారు చేసి ఆ ఇంటి ఓనర్షిప్‌ను సొంతం చేసుకున్నదా? అని రాఖీ గుప్తా భయాందోళనలకు గురయ్యారు.
ఈ దంపతులు పోలీసులను కూడా ఆశ్రయించారు. ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రీతిని రమ్మన్నా వెళ్లలేదని పేర్కొన్నారు. తాము ఇప్పుడు పోలీసు కమిషనర్‌ను కలవాలని అనుకుంటున్నామని, కానీ, పోలీసులు అందరూ ఇది సివిల్ మ్యాటర్ అని, దానిపై కోర్టుకు వెళ్లాలని చెబుతున్నారని వివరించారు.
ఈ సమస్య ఎంత కాలం సాగుతుందో.. తాము ఎన్నాళ్లు ఈ మెట్లపై గడపాలో అర్థం కావడం లేదని సునీల్ కుమార్ చెప్పారు. ప్రీతి ప్రస్తుతం అందుబాటులో లేదు. ఫ్లాట్‌కు లాక్ వేసుకుని మళ్లీ తిరిగి రాలేదు.
