Asianet News TeluguAsianet News Telugu

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆలయం.. సందర్శకుల తాకిడి

పూణెకు చెందిన ఓ బిజినెస్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆలయాన్ని నిర్మించారు. రూ. 1.6లక్షలతో నిర్మించిన ఆ ఆలయాన్ని ఆగస్టు 15న ప్రారంభించగా, ప్రస్తుతం చుట్టుపక్కల నుంచి సందర్శకుల తాకిడి పెరుగుతున్నట్టు వివరించారు.

temple built for pm narendra modi in pune
Author
Pune, First Published Aug 18, 2021, 5:33 PM IST

పూణె: భారత్‌లో విశ్వాసాలు, నమ్మకాలు బలంగా ఉంటాయి. ఒక సంప్రదాయాన్ని, దైవాన్ని, మనిషినీ విశ్వసించాడంటే ఆ వ్యక్తి అన్నిరూపాల్లో తన అభిమానాన్ని వ్యక్తపరుస్తుంటారు. అభిమానించే మనిషిని నెత్తినపెట్టుకుంటారు. రేయింబవళ్లు ప్రశంసల్లో ముంచెత్తడమే కాదు, అవసరమైతే వారికి ఆలయాలు కట్టేవరకూ వెళ్తుందీ అభిమానం. మనదేశంలో నటులకు, ప్రియతమ రాజకీయ నేతలు, ఇతరులకు ఆలయాలు కొత్తేమీ కాదు. తాజాగా, ఇదే కోవలో ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఆలయం నిర్మించారు. లక్షన్నర ఖర్చుతో నిర్మించిన ఈ ఆలయాన్ని ఆగస్టు 15న (స్వాతంత్ర్య దినోత్సవాన) ప్రారంభించారు. ఇప్పుడు చుట్టుపక్కల నుంచి ఈ ఆలయ సందర్శనకు అభిమానుల తాకిడి పెరుగుతున్నది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలయం మహారాష్ట్రలో పూణెలోని ఔంధ్ ఏరియాలో నిర్మించారు. 37ఏళ్ల బీజేపీ కార్యకర్త మయూర్ ముండే ఈ ఆలయాన్ని నిర్మించారు. తను నివసిస్తున్న ప్రాంతంలోనే రూ. 1.60 లక్షలు పెట్టి నిర్మించినట్టు ఆయన వివరించారు. ఈ ఆలయ నిర్మాణానికి ఆరు నెలలు పట్టిందని తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఈ ఆలయాన్ని ప్రారంభించినట్టు చెప్పారు. ప్రధాని మోడీని కొలిచేందుకు ఆలయానికి చుట్టుపక్కల నుంచి ప్రజలు వస్తున్నారని అన్నారు. 

రియల్ ఎస్టేట్ బిజినెస్‌మ్యాన్ అయిన ముండే ఈ ఆలయం గురించి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు. ప్రధాని మంత్రి అయ్యాక నరేంద్ర మోడీ ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారన్నారు. జమ్ము కశ్మీర్‌కు 370 అధికరణాన్ని నిర్వీర్యం చేయడం, రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం చేయడం, ట్రిపుల్ తలాఖ్ వంటి ఎన్నో కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేశారని వివరించారు. అయోధ్యలో రామాలయాన్ని నిర్మించే వ్యక్తికి ఒక మందిరం ఉండాలని తాను భావించినట్టు చెప్పారు. అందుకే తన నివాసంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆలయం నిర్మించాలని నిర్ణయించుకున్నట్టు వివరించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విగ్రహానికి, ఇతర ఎరుపు మార్బుల్స్‌ను జైపూర్ నుంచి తెప్పించినట్టు ముండే తెలిపారు. ఇందుకు ఖర్చు మొత్తం రూ. 1.6 లక్షలు అయినట్టు వెల్లడించారు. ప్రధాని మోడీ విగ్రహాన్ని కాపాడేందుకు మందంగా ఉండే అద్దాలను బిగించినట్టు వివరించారు. ఆయనకు అంకితమిస్తూ ఓ కవితను మోడీ విగ్రహం పక్కనే ఉంచినట్టు తెలిపారు. కాగా, ఈ ఆలయంపై కాంగ్రెస్, ఎన్‌సీపీలు విమర్శలు కురిపించారు.

Follow Us:
Download App:
  • android
  • ios