ఉన్నపళంగా లాక్ డౌన్ విధించడంతో చాలామంది వారి ఊళ్లకు దూరంగా చిక్కుబడిపోయారు. లాక్ డౌన్ ను ఎత్తివేస్తారా, మరికొంత కాలం పొడిగిస్తారా అనే అనిశ్చితి కొనసాగుతుండడంతో ప్రజలంతా తమ ఇండ్ల వద్దకు పంపించేయమని అధికారులను వేడుకుంటున్నారు. 

కొందరు వలస కార్మికులయితే కొన్ని వేల కిలోమీటర్లను ఏకంగా కాలినడకన చేరుకోవడానికి పయనమైన విషయము తెలిసిందే! ఇక ఇలానే రాజస్థాన్ లోని కోటాలో ఐఐటీ, నీట్ ల కోచింగ్ కోసం చాలా మంది అక్కడకు వెళ్లే విషయం తెలిసిందే. దేశంలోని కొన్ని అగ్రగామి సంస్థలు అక్కడే ఉండడంతో విద్యార్థులు ఎన్నో కష్టనష్టాలకోర్చి అక్కడ ఉంటుంటారు. 

ఇప్పుడు లాక్ డౌన్ దెబ్బకు వారంతా తమ సొంత రాష్ట్రాల ముఖ్యమంత్రులను వేడుకుంటూ వీడియో మెసేజిలను పెట్టడం, కొందరు ముఖ్యమంత్రులు స్పందించి వారిని తీసుకుపోవడం కూడా జరిగిపోయాయి. 

తాజాగా మన తెలుగు రాష్ట్రాలకు చెందిన పిల్లలు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, తమను వెనక్కి తీసుకురమ్మని వేడుకుంటూ వీడియోను విడుదల చేసారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన పిల్లలు తమను ఆదుకోవాలంటూ జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్ లను కోరారు. 

ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలాగైతే తమ విద్యార్థులను వెనక్కి తీసుకెళ్లారో... అలానే తమను సైతం తమ సొంత ఊర్లకు తీసుకెళ్లాలానివేడుకుంటున్నారు. చూడాలి ఈ విద్యార్థులు కోరికకు ఇరు ముఖ్యమంత్రులు ఎలా స్పందిస్తారో?

ఇకపోతే తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా ఆదివారం కొత్తగా 11 మందికి కరోనా సోకినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీరితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి వారి సంఖ్య 1,001కి చేరింది.

ఇవాళ నమోదైన కేసులన్నీ హైదరాబాద్‌ పరిధిలోనివే కావడం ఆందోళన కలిగించే అంశం. కాగా తెలంగాణ ఇప్పటి వరకు కరోనా కారణంగా 25 మంది మరణించారు. మరోవైపు కోవిడ్ 19 నుంచి కోలుకున్న 9 మందిని ఆదివారం డిశ్చార్జ్ చేశారు.