అఖిల భారత సర్వీసుల్లోని ఉద్యోగాల భర్తీకి నిర్వహించే సివిల్స్ 2019 పరీక్షా ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ మంగళవారం విడుదల చేసింది. ఆ ఇంటర్వ్యూ ఫలితాల్లో సివిల్ సర్వీసెస్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను మెరిట్ ఆధారంగా విడుదల చేసింది కమీషన్.

2019 మెయిన్స్ పరీక్షల్లో ప్రదీప్ సింగ్ టాపర్‌గా నిలవగా.. జతిన్ కిషోర్, ప్రతిభా వర్మలు వరుసగా రెండు, మూడో ర్యాంక్ సాధించారు. మొత్తం 829 మంది అభ్యర్ధులు వారి రిజర్వేషన్ల ఆధారంగా ఎంపిక చేయబడ్డారు.

ఇందులో జనరల్ కేటగిరీ కింద 304, ఎకనామికలీ వీకర్ సెక్షన్ కేటగిరీలో 78 మంది, ఓబీసీ అభ్యర్ధులు 251, ఎస్సీ 129, ఎస్టీలో 67 మంది అభ్యర్థులు సెలక్ట్ అయ్యారు. మరో 182 మంది ఫలితాలను రిజర్వ్‌లో ఉంచినట్లు యూపీఎస్సీ తెలిపింది.

ఇక సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు సత్తా చాటారు. పెద్దిటి ధాత్రిరెడ్డి 46వ ర్యాంకు, మల్లవరపు సూర్యతేజకు 76వ ర్యాంకు, కట్టా రవితేజకు 77వ ర్యాంకు, ఎంవీ సత్యసాయి కార్తీక్‌ 103,  తాటిమాకుల రాహుల్‌ రెడ్డి 117, కె. ప్రేమ్‌ సాగర్‌ 170,  శ్రీ చైతన్య కుమార్‌ రెడ్డి 250, చీమల శివగోపాల్ రెడ్డి 263, నారాయణపేటకు చెందిన బి. రాహుల్‌కు 272వ ర్యాంకు, యలవర్తి మోహన్‌ కృష్ణ 283,  ఎ. వెంకటేశ్వర్‌ రెడ్డి 314వ ర్యాంకు, ముత్తినేని సాయితేదజ 344, ముక్కెర లక్ష్మీ పావన గాయత్రి 427వ ర్యాంకు, కొల్లాబత్తుల కార్తీక్‌ 428, ఎన్‌ వివేక్‌ రెడ్డి 485, నీతిపూడి రష్మితారావు 534, కోరుకొండ సిద్ధార్థ 566, సమీర్‌ రాజా 603, కొప్పిశెట్టి కిరణ్మయి 633వ ర్యాంక్‌ సాధించారు.