కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరితో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ ఎంపీలు సమావేశం అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అందుకు కొద్ది శాతాల్లో కేంద్ర ప్రభుత్వమూ నిధులు ఇవ్వాలని కోరారు. 

కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరితో మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ ఎంపీల భేటీ.. వీటిపైనే చర్చ

న్యూఢిల్లీ: తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం అవుతున్నారు. తాజాగా, ఈ రోజు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ హర్దీప్ సింగ్ పూరీతో భేటీ అయ్యారు. కేటీఆర్‌తోపాటు బీఆర్ఎస్ ఎంపీలూ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పలు విజ్ఞప్తులను అందజేశారు. అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్ర ప్రభుత్వమూ కొన్ని నిధులు అందించాలని అడిగారు.

రాజధాని హైదరాబాద్‌లో లక్డీకపూల్ నుంచి బీహెచ్ఈఎల్ వరకు 26 కిలోమీటర్ల మేరకు, అలాగే నాగోల్ నుంచి ఎల్బీ నగర్ వరకు అంటే సుమారు ఐదు కిలోమీటర్ల వరకు మెట్రోకు ఆమోదం, ఆర్థిక సహకారం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీ పథకం తరహాలోనే పట్టణ పేదల కోసం ప్రత్యేక ఉపాధి హామీ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా తీసుకురావాలని ప్రతిపాదన చేశారు. మిస్సింగ్, లింకు రోడ్డుల నిర్మాణాలు నడుస్తున్నాయని, ఇప్పటికి 22 మిస్సింగ్ లింక్ రోడ్లు పూర్తి చేశామని, మరో 17 రోడ్ల నిర్మాణాలూ పూర్తికావొచ్చాయని అన్నారు. అలాగే, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి పరిసర పురపాలికలకు మొత్తం 104 అదనపు కారిడార్లను నిర్మించడానికి సుమారు రూ. 2,400 కోట్లు అవుతాయని, దీని కోసం కేంద్రం రూ. 800 కోట్లు కేటాయించాలని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీని మంత్రి కేటీఆర్ కోరారు.

Also Read: మణిపూర్‌లో హింసపై అమిత్ షా సారథ్యంలో అఖిలపక్ష భేటీ.. కాంగ్రెస్ ఏమన్నదంటే?

ప్రొక్యూర్‌మెంట్ వాహనాలు, ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌ల నిర్మాణం వంటి పనుల కోసం స్వచ్ఛ భారత్ మిషన్ లేదా ఇరత కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కింద రూ. 400 కోట్లు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ వేను రూ. 3,050 కోట్లతో నిర్మిస్తున్నామని, ఇందుకు రూ.450 అంటే 15 శాతం నిధుల ఆర్థిక సహాయం చేయాలని అన్నారు.

ఎస్టీపీల కోసం 20 శాతం అంటే రూ. 744 కోట్లు కేంద్రం అందించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. మానవ వ్యర్థాల శుద్ధి ప్లాంట్లు ఇతర కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా పురపాలికల్లో రూ. 3,777 కోట్లతో చేపడుతున్నామని, ఇందుకోసం రూ. 750 కోట్లు ఇవ్వాలని కోరారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన శానిటేషన హబ్ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రశంసించారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా అనేక సవాళ్లకు సమాధానం లభిస్తుందని అన్నారు. దీని నమూనా, ఆలోచనలను పంచుకోవాలని హర్దీప్ సింగ్ పూరి కేటీఆర్‌ను కోరారు. త్వరలో తన మంత్రిత్వ శాఖ ఢిల్లీలో ఏర్పాటు చేసే సమావేశంలో ప్రెజెంటేషన్ ఇవ్వాలని కేంద్రమంత్రి అడిగారు.

డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఎస్ఆర్‌డీపీ, లింక్ రోడ్లు, పారిశుధ్య రంగంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ వంటి తాము చేపడుతున్న కార్యక్రమాలను స్వయంగా పరిశీలించడానికి హైదరాబాద్‌కు విచ్చేయాలని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరిని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు.