Asianet News TeluguAsianet News Telugu

మహారాష్ట్ర ‘స్థానిక’ ఎన్నికల బరిలో బీఆర్ఎస్.. నాందేడ్ సభలో ప్రకటించిన కేసీఆర్

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని ఆయన తెలిపారు. మహారాష్ట్ర పంచాయతీ, జిల్లా పరిషత్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేస్తామని కేసీఆర్ జోస్యం చెప్పారు.

telangana cm kcr speech at brs party public meeting in nanded
Author
First Published Mar 26, 2023, 4:17 PM IST

మహారాష్ట్ర లోకల్‌ బాడీ ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ .   ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా లోహాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. దేవేంద్ర ఫడ్నవీస్ హామీ ఇస్తే తాను మహారాష్ట్రకు రావడం మానేస్తానన్నారు. తెలంగాణ మోడల్‌లాగా రైతుకు ప్రతి ఎకరాకు 10 వేలు ఇవ్వాలని.. తెలంగాణలో దళితుల కోసం దళిత బంధు పథకం తెచ్చామని కేసీఆర్ తెలిపారు. ఇది దేశంలోనే అద్బుతమైన పథకమని.. ఫడ్నవీస్ దళిత బంధు అమలు చేస్తే తాను మహారాష్ట్రకు రానని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్రలో మీకేం పని అని ఫడ్నవీస్ తనను ఉద్దేశించి అన్నారని.. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటినా ప్రజల బతుకులు మారలేదని దేవేంద్ర ఫడ్నవీస్ దుయ్యబట్టారు. 

ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీలు రైతులకు ఏం చేశాయని ఆయన ప్రశ్నించారు. భారత పౌరుడిగా తాను ప్రతి రాష్ట్రానికి వెళ్తానని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ రెండు పార్టీల పాలనలో రైతుల పరిస్ధితి ఎందుకు మారలేదని ఆయన ప్రశ్నించారు. తాను చెప్పేది నిజమో, అబద్ధమో మీరే ఆలోచించాలని కేసీఆర్ ప్రజలను కోరారు. దేశంలో సరిపడా నీటి నిల్వలు వున్నా కనీసం తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నామని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో దేశంలో రైతు తుఫాన్ రాబోతోందని.. దాన్నెవరూ ఆపలేరని కేసీఆర్ పేర్కొన్నారు. ఎంతమంది పాలకులు మారినా తలరాతలు  మారడం లేదని ఎద్దేవా చేశారు. 

మహారాష్ట్రలో సాగు, తాగునీరు చాలా చోట్ల అందుబాటులో లేదని.. ఇక్కడ ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. మహారాష్ట్రలో ప్రతి ఎకరాకు పదివేలు ఇచ్చే వరకు కొట్లాడతామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మన కళ్ల ముందే నీరు సముద్రంలో కలిసిపోతోందని.. 125 ఏళ్ల పాటు విద్యుత్ ఇచ్చేంత బొగ్గు మన దగ్గర వుందని సీఎం అన్నారు. అయినా ఎందుకు విద్యుత్ ఇవ్వలేకపోతున్నారని కేసీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ నాందేడ్‌కు రాగానే రైతులకు 6 వేలు వచ్చాయని.. ముందే ఎందుకు రాలేదని ఆయన నిలదీశారు. బిచ్చం వేసినట్లు రూ.6 వేలు ఇవ్వడం ఏంటీ.. 10 వేలు ఎందుకు ఇవ్వరని కేసీఆర్ ప్రశ్నించారు. 

రైతులు ఎవరినీ ప్రాధేయపడాల్సిన అవసరం లేదని.. ఢిల్లీ చుట్టూ రైతులు ఏడాది పాటు ధర్నా చేశారని కేసీఆర్ గుర్తుచేశారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి మహారాష్ట్రలోనూ జరగాలని ఆయన ఆకాంక్షించారు. మహారాష్ట్ర పంచాయతీ, జిల్లా పరిషత్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేస్తామని కేసీఆర్ జోస్యం చెప్పారు. యూపీ , పంజాబ్ ఎన్నికల్లో తియ్యటి మాటలు చెప్పి.. ప్రధాని మోడీ క్షమాపణలు కోరారని సీఎం ఎద్దేవా చేశారు. తెలంగాణ రైతుల దుస్థితి చూసి రోజు ఏడ్చేవాడినని సీఎం పేర్కొన్నారు. రైతు బీమా ద్వారా తెలంగాణ రైతులకు రూ.5 లక్షలు ఇస్తున్నామన్నారు .

Follow Us:
Download App:
  • android
  • ios