చెన్నై: ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా తెలంగాణ సీఎం కేసీఆర్ వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా వేర్వేరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసిన కేసీఆర్ లోక్ సభ ఎన్నికల అనంతరం మళ్లీ రాష్ట్రాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు. 

ఇప్పటికే కేరళ సీఎం పినరయి విజయన్ ను కలిసిన కేసీఆర్ సోమవారం డీఎంకే అధినేత స్టాలిన్ ను కలిశారు. స్టాలిన్ తో సుమారు గంటన్నరపాటు కేసీఆర్ భేటీ అయ్యారు. భేటీ అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. 

డీఎంకే అధినేత స్టాలిన్ కేసీఆర్ కు హ్యాండ్ ఇచ్చారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే డీఎంకే పార్టీ యూపీఏ కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉంది. కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ అంటూ స్టాలిన్ ఇప్పటికే ప్రకటనలు చేశారు కూడా. 

బీజేపీ యేతర పక్షాలతో ఉన్న స్టాలిన్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు అడుగులు వేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ కావడంపై ఆసక్తి నెలకొంది. డీఎంకే చీఫ్ స్టాలిన్ తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై ఎలాంటి హామీ ఇవ్వలేదని అందువల్లే ఆయన మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.