Asianet News TeluguAsianet News Telugu

డిల్లీలో కేసీఆర్ బిజీబిజీ... మరో కేంద్ర మంత్రితో భేటీ...

తెలంగాణ సీఎం కేసీఆర్ దేశ రాజధాని డిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇవాళ పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమైన ఆయన తెలంగాణ సమస్యలు, అభివృద్ది గురించి చర్చించారు. ఇప్పటికే కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసిన ఆయన తాజాగా మరో మంత్రి నితీన్ గడ్కరిని కలిశారు.

telangana cm kcr meeting with central minister nithin gadkari
Author
Delhi, First Published Aug 27, 2018, 5:57 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ దేశ రాజధాని డిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇవాళ పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమైన ఆయన తెలంగాణ సమస్యలు, అభివృద్ది గురించి చర్చించారు. ఇప్పటికే కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసిన ఆయన తాజాగా మరో మంత్రి నితీన్ గడ్కరిని కలిశారు.

ఈ సందర్భంగా  గడ్కరీతో తెలంగాణ రాష్ట్రంలోని జాతీయ రహదారుల అభివృద్ధి, రీజినల్ రింగ్‌రోడ్డు, సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చర్చించారు.  సంగారెడ్డి-నర్సాపూర్-తూప్రాన్-గజ్వేల్-జగదేవ్ పూర్-భువనగిరి-చౌటుప్పల్ మీదుగా వెళ్లే 154 కిలోమీటర్ల రహదారిని, చౌటుప్పల్-యాచారం-షాద్ నగర్- చేవెళ్ల- శంకర్ పల్లి- కంది మీదుగా వెళ్లే 180 కిలోమీటర్ల రహదారిని జాతీయ రహదారిగా విస్తరించేందుకు అంగీకరించినందుకు కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ రెండు రహదారులు హైదరాబాద్ నగరానికి రీజనల్ రింగు రోడ్డుగా మారుతున్నాయని వివరించారు.  

జాతీయ రహదారులను గ్రీన్ హైవేలుగా మార్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతిష్టాత్మకమైన తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నట్లు కేంద్ర మంత్రికి సిఎం వివరించారు. జాతీయ రహదారుల పక్కన మొక్కలు పెంచే బాధ్యత వర్క్ ఏజన్సీలు, నిర్వహణ సంస్థలదే అయినా, వారు సరిగా నిర్వహించడం లేదని సిఎం చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా మొక్కలు నాటినప్పటికీ, వాటి సంరక్షణ సరిగా లేదని వివరించారు. జాతీయ రహదారుల వెంట మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం లాంటి పనులను అనుభవం, యంత్రాంగం కలిగిన రాష్ట్ర అటవీశాఖకు అప్పగించాలని కోరారు. దీనివల్ల జాతీయ రహదారులను గ్రీన్ హైవేలుగా మార్చే లక్ష్యం నెరవేరుతుందని సిఎం అభిప్రాయపడ్డారు. 

తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నదిపై నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు కొత్త ప్రాజెక్టు కాదని, దీని పాత ప్రాజెక్టుగానే గుర్తించాలని, దీనికి సంబంధించి కేంద్ర జల సంఘానికి ఆదేశాలు జారీ చేయాని ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర మంత్రి గడ్కరీని కోరారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చినట్లే, పాత ప్రాజెక్టును సీతారామ ప్రాజెక్టుగా మార్చామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును పాత ప్రాజెక్టుగా పరిగణించినట్లే, సీతారామను కూడా  పాత ప్రాజెక్టుగానే పరిగణించాలని సిఎం కోరారు. 

గడ్కరీతో జరిగిన ఈ సమావేశంలో సీఎంతో పాటు ఎంపీలు వినోద్‌కుమార్, బూర నర్సయ్యగౌడ్ లు పాల్గొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios