ప్రభుత్వం ఎంతటి కఠిన చట్టాలు తెచ్చినా.. స్వచ్ఛంద సంస్థలు ఎన్ని అవగాహనా సదస్సులు నిర్వహించినా దేశంలో లంచం అనే మహమ్మారి మాత్రం విజృంభిస్తూనే ఉంది.

తాజాగా భూమి యాజమాన్య హక్కుల బదలాయింపు చేయడానికి లంచం అడిగిన తహశీల్దార్‌కు ఓ రైతు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే... మధ్యప్రదేశ్ ఖర్గాపూర్‌ మండలంలోని దేవ్‌పూర్ గ్రామానికి చెందిన రైతు లక్ష్మీయాదవ్.. ఈయన తన ఇద్దరి కోడళ్ల పేరుతో కొంత భూమిని కొనుగోలు చేశాడు.

అందుకు సంబంధించి భూమి యాజమాన్య హక్కుల బదలాయింపు, ఇతర పనుల కోసం తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ తహసీల్దార్‌గా పని చేస్తున్న అధికారి... ఈ పనుల నిమిత్తం రూ.లక్ష డిమాండ్ చేశాడు.

చివరికి రూ.50,000 చెల్లిస్తానని బతిమలాడాడు. కానీ తహశీల్దార్ మరో రూ.50 వేలు ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పాదు. తన వద్ద అంత సొమ్ము లేకపోవడంతో లక్ష్మీయాదవ్ మనస్తాపానికి గురయ్యాడు.

వెంటనే ఇంటికి వెళ్లి తన బర్రెను తీసుకెళ్లి సదరు అధికారి వాహనానికి కట్టేశాడు. అక్కడికి వచ్చిన ప్రజలు లక్ష్మీయాదవ్ పరిస్థితిని చూసి తహశీల్దార్‌ను అసహ్యించుకున్నారు.

విషయం ఆ నోటా ఈ నోటా జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లింది. వెంటనే ఆయన ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టడానికి మరో అధికారిని నియమించారు. ఈ విచారణలో తహశీల్దార్..రైతును లంచం అడిగినట్లుగా తేలింది.