స్నేహితులతో గడపాల్సిన సమయంలో కోడింగ్ పై దృష్టి పెట్టాడు. చివరకు రూ.33లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని సంపాదించాడు. అయితే.. వయసు తక్కువ కావడంతో ఆ ఉద్యోగంలో చేరలేకపోవడం గమనార్హం. 

సాధారణంగా 15ఏళ్ల వయసు పిల్లలు ఏం చేస్తారు..? చదువు అయితే పదో తరగతి లేదంటే.. ఇంటర్ చదువుతారు. ఇక స్నేహితులతో సరదాగా తిరగడం లాంటివి చేస్తారు. కానీ.. ఓ 15ఏళ్ల బాలుడు మాత్రం అలా కాదు. చిన్న వయసులోనే ఉన్నత స్థాయికి ఎదిగాడు. స్నేహితులతో గడపాల్సిన సమయంలో కోడింగ్ పై దృష్టి పెట్టాడు. చివరకు రూ.33లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని సంపాదించాడు. అయితే.. వయసు తక్కువ కావడంతో ఆ ఉద్యోగంలో చేరలేకపోవడం గమనార్హం.

మహారాష్ట్రలోని నాగ్ పూర్ కి చెందిన వేదాంత్ అనే 15ఏళ్ల కుర్రాడు ఈ ఘనత సాధించాడు. వేదాంత్ అమెరికాలోని న్యూ జెర్సీలో యాడ్ ఎజెన్సీ ఇటీవల నిర్వహించిన ఆన్ లైన్ కోడింగ్ కాంపిటేషన్ లో పాల్గొన్నాడు. ఆ కాంపిటేషన్ లో అతను చూపించిన ప్రతిభకు ఈ ఉద్యోగం ఆఫర్ చేయడం గమనార్హం. కేవలం రెండు రోజుల్లోనే 2,066 లైన్ల ప్రోగ్రామింగ్ కోడ్ రాసి అందరినీ విస్మయానికి గురి చేశాడు. అతని ప్రతిభకు మెచ్చి రూ.33లక్షల జీతంతో ఉద్యోగం ఆఫర్ చేశారు.

అయితే.. సదరు కంపెనీ ఉద్యోగం ఆఫర్ చేసే సమయంలో... వేదాంత్ వయసు వారికి తెలీదు. తర్వాత తెలియడంతో.. ఉద్యోగ ఆఫర్ ని ఇవ్వడానికి నిరాకరించింది. ఇప్పుడే ఉద్యోగం అవసరం లేదని.. ఉన్నత చదువులపై దృష్టి పెట్టాలని సూచించింది. చదువు పూర్తైన తర్వాత తమ సంస్థను సంప్రదించాలని చెప్పడం గమనార్హం.