విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే దారితప్పాడు. కూతుళ్లతో సమానంగా చూడాల్సిన విద్యార్థినులను లైంగికంగా వేధించాడు. ఫలితంగా ఆ నేరం కింద ఉపాధ్యాయుడికి న్యాయస్థానం ఏకంగా 49ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ సంఘటన  తమిళనాడులో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 పుదుకోట జిల్లా గంధర్వకోట సమీపం తువార్‌ గ్రామానికి చెందిన అన్బరసన్‌ (52) నరియన్‌పుదుపట్టి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు. అదే పాఠశాలలో జ్ఞానశేఖరన్‌ (50) ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. 

ఆ పాఠశాలలో చదువుతున్న ఆరుగురు విద్యా ర్థినులపై 2018లో ఉపాధ్యాయులు అన్బరసన్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, ఈ విషయాన్ని ప్రధానోపాధ్యాయుడికి తెలిపినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని పుదుకోట మహిళా పోలీస్‌స్టేషన్‌లో అందిన ఫిర్యాదుతో, అన్బరసన్‌, జ్ఞానశేఖరన్‌లపై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసి వారిని అరెస్టు చేశారు. 

ఈ కేసు విచారణ పుదుకోట మహిళా న్యాయస్థానంలో జరుగుతుండగా న్యాయమూర్తి సత్య, ఉపాధ్యాయుడు అన్బరసన్‌కు మూడు సెక్షన్లకింద మొత్తం 49 ఏళ్ల జైలుశిక్ష, ప్రధానోపాధ్యాయుడు జ్ఞానశేఖరన్‌కు ఏడాది జైలుశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. అలాగే, బాధిత విద్యార్థినులకు తలా రూ.1.50 లక్షల చొప్పున రాష్ట్రప్రభుత్వం పరిహారం అందజేయాలని ఉత్తర్వులు జారీ చేశారు