టీడీపీ అధినేత చంద్రబాబునాయడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించారు. భవిష్యత్తుకు గ్యారెంటీ మేనిఫెస్టో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆర్టీసీ బస్సులో ప్రయాణించి అందర్ని ఆశ్చర్యపరిచారు.
ఆంధ్రప్రదేశ్ లో వై ఎస్ జగన్ ప్రభుత్వ విధానాలకు నిరసనగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు రాష్ట్రంగా పర్యటిస్తున్నారు. భవిష్యత్తుకు గ్యారెంటీ మేనిఫెస్టో ప్రచార కార్యక్రమంలో ఇవాళ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కొత్త పేట నియోజకవర్గంలో పర్యటించారు. ఈ పర్యటనలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఎవరు ఊహించిన విధంగా చంద్రబాబు ఓ ఆర్టీసీ బస్సులో ఎక్కి ప్రయాణం చేశారు.
ఈ ప్రయాణం బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు నుంచి జొన్నడ వరకు సాగింది. ఆయన బస్సులో ప్రయాణించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. పలువురు ప్రయాణికులతో సరదగా కాసేపు ముచ్చటించారు. అలాగే.. వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్ కు గ్యారెంటీ ప్రచార కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధికారంలోకి వస్తే.. అమలు చేసే హామీల్ని వివరించారు.
భారంగా మారిన నిత్యావసర వస్తువుల ధరలు, ప్రభుత్వ పన్నులపై మహిళలు చంద్రబాబుతో మాట్లాడుతూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు కరెంట్ బిల్లులు వేలల్లో వస్తున్నాయని, ఆ కరెంటు బిల్లులు తమకు తీవ్ర భారం గా మారాయని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.
టీడీపీ అధికారంలోకి వస్తే.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చంద్రబాబు హమీ ఇచ్చారు . దీంతో మహిళలు హర్షం వ్యక్తం చేశారు. అలాగే.. సూపర్ సిక్స్ పథకాల్లో భాగం గా ప్రకటించిన మహా శక్తి పథకం గురించి చంద్రబాబు మహిళలకు వివరించారు. తాము అధికారంలోకి వస్తే ఆరు పథకాల్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
