ట్యాక్సీ నడుపుకుంటూ జీవనం సాగించే ఓ డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు.  అతనిని దారుణంగా చంపేసి శవాన్ని పొలంలో పడేసినట్లు గుర్తించారు. అయితే.. చివరగా అతని ట్యాక్సీ ఎక్కిన దంపతులే అతనిని హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ సంఘటన ఒడిశాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

భువనేశ్వర్‌లో ట్యాక్సీ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న సుధీర్‌కుమార్‌ సాహు వద్దకు ఈ నెల 25వ తేదీన ఇద్దరు దంపతులు వచ్చి, తమను కొరాపుట్‌లో డ్రాప్‌ చేయమని కోరారు. అయితే ఆ రోజు నుంచి ఇప్పటివరకు సుధీర్‌ ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన బాధిత కుటుంబ సభ్యులు అతడికి ఫోన్‌ చేశారు. ఫోన్‌ కూడా స్విచ్‌ ఆఫ్‌ రావడంతో అనుమానించిన కుటుంబ సభ్యులు ఈ విషయంపై ఖండగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సుధీర్‌ ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా ట్రేస్‌ అవుట్‌ చేయగా, బొరిగుమ్మ ప్రాంతంలో అతడు ఉన్నట్లు తెలిసింది. ఇదే విషయాన్ని తెలుసుకున్న రాయగడ జిల్లాలో ఉంటున్న అతడి‌ సోదరుడు కేధార్‌నాథ్‌సాహు బొరిగుమ్మ సమితిలోని చతర్ల గ్రామానికి చేరుకున్నాడు. అనంతరం అక్కడి పొలంలో పడి ఉన్న మృతదేహం చూసి, కన్నీటిపర్యంతమయ్యాడు. 

ఆ తర్వాత ఇదే ఘటనపై కేసు నమోదు చేసిన బొరిగుమ్మ పోలీసులు క్లూస్‌ టీం సేకరించిన ఆధారాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఘటన స్థలంలో సుధీర్‌ ట్యాక్సీ కూడా లేకపోవడంతో ఆరోజు ఇతడి ట్యాక్సీలో ప్రయాణించిన దంపతులే ఇతడిని హత్య చేసి, డబ్బు, వాహనంతో పరారై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని బొరిగుమ్మ పోలీస్‌ అధికారి సంజయ్‌కుమార్‌ మండల్‌ తెలిపారు.