Asianet News TeluguAsianet News Telugu

‘టాటా’ చేతికి ఎయిర్ ఇండియా.. కేంద్ర ప్రభుత్వం ప్రకటన

ఎట్టకేలకు ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ టాటాల చేతికే వెళ్లింది. ఎయిర్ ఇండియాను స్థాపించిన దాదాపు 60ఏళ్ల తర్వాత తిరిగి టాటాల గూటికే చేరింది. రూ. 18వేల బిడ్ వేసిన టాటా సన్స్ గ్రూప్ ఎయిర్ ఇండియాలో 100 శాతం షేర్ హోల్డింగ్‌ను సొంతం చేసుకున్నట్టు కేంద్రం ప్రభుత్వం ప్రకటించింది.
 

tata sons won air india with rs 18000 crore bid
Author
New Delhi, First Published Oct 8, 2021, 5:16 PM IST

న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విక్రయ బిడ్‌లపై కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. ఎయిర్ ఇండియా కొనుగోలుకు వేసిన బిడ్‌ను టాటా సన్స్ గ్రూప్ గెలుచుకుంది. అందరికంటే ఎక్కువగా రూ. 18వేల కోట్ల బిడ్ వేసి ఎయిర్ ఇండియాను సొంతం చేసుకుంది. ఇన్వెస్ట్‌మెంట్, పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ శాఖ కార్యదర్శి తుహిన్ కాంత్ ఈ విషయాలను ప్రకటించారు. టాటా సన్స్ గ్రూప్ రూ. 18వేల కోట్ల బిడ్‌తో ఎయిర్ ఇండియాలో 100శాతం షేర్ హోల్డింగ్‌ను సొంతం చేసుకున్నారని తెలిపారు. 

ఎయిర్ ఇండియా షేర్ హోల్డింగ్‌తోపాటు గ్రౌండ్ హ్యాండ్లింగ్ కంపెనీ ఎయిర్ ఇండియా శాట్స్‌లోనూ 50శాతం యాజమాన్యాన్ని సొంతం చేసుకుంది. టాటా సన్స్‌కు చెందిన ట్యాలెస్ ప్రైవేటు లిమిటెడ్ ఈ బిడ్ గెలుచుకున్నట్టు కేంద్రం వెల్లడించింది. సంపూర్ణ విక్రయ ప్రక్రియ అంటే హ్యాండోవర్ ఈ ఏడాది చివరికల్లా ముగుస్తుందని వివరించింది.

ప్రస్తుతం ఎయిర్ ఇండియాలో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించడానికి వీల్లేదని కేంద్రం తెలిపింది. ఒక ఏడాది పాటు వారి ఉద్యోగాలు కచ్చితంగా ఉంటాయని, తర్వాత ఏడాది నుంచి టాటా సన్స్ వారికి వాలంటరీ రిటైర్‌మెంట్ స్కీమ్ అమలు చేయవచ్చునని వివరించింది. ఉద్యోగులందరికీ పీఎఫ్, గ్రాట్యుటీ సదుపాయాలు అందించాల్సి ఉంటుంది. 

 

ప్రస్తుతం ఎయిర్ ఇండియాలో మొత్తం 12,085 మంది ఉద్యోగులున్నారని, ఇందులో 8,084 మంది శాశ్వత, 4,001 మంది కాంట్రాక్చువల్ ఉద్యోగులని పౌరవిమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్ బన్సాల్ వివరించారు. వీరితోపాటు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో 1,434 మంది ఉద్యోగులున్నారని తెలిపారు.

ఎయిర్ ఇండియ అమ్మకం కోసం ప్రభుత్వం రిజర్వ్ ప్రైస్‌గా రూ. 12906 కోట్లను నిర్ణయించింది. ఈ విలువ కంటే సుమారు ఐదు వేల కోట్ల రూపాయాలు ఎక్కువ బిడ్ వేసి ఈ సంస్థను సుమారు 60ఏళ్ల తర్వాత తిరిగి చేజిక్కించుకున్నది. ఎయిర్ ఇండియాకు మొత్తం సుమారు 61వేల కోట్ల రుణాలున్నాయి. ఇందులో 15,300 కోట్లు బిడ్ గెలుచుకున్నవారు కట్టుకోవాల్సి ఉంటుంది. అంటే రూ. 2,700 కోట్లు ప్రభుత్వానికి వెళ్లనున్నాయి. కాగా, మిగతా అప్పు సుమారు రూ. 46వేల కోట్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎయిర్ ఇండియా అసెట్స్ హోల్డింగ్ లిమిటెడ్‌కు బదిలీ చేయనుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios