Gujarat: గుజారాత్ లో వ‌చ్చే నెల‌లో ప్ర‌ధాని మోడీ 16 మంది భార‌తీయ ప్ర‌ముఖుల విగ్ర‌హాల‌ను ఆవిష్క‌రించ‌నున్నార‌ని స‌మాచారం. రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా ఉన్న అన్ని అవ‌కాశాల‌ను బీజేపీ ఉప‌యోగించుకోవాల‌ని చూస్తోంద‌ని రాజకీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.  

Gujarat assembly elections: త్వరలో జరగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాజకీయ పార్టీలన్నీ ముమ్మరంగా సిద్ధమవుతున్నాయి. అదే సమయంలో హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల తేదీలను కూడా ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే గుజరాత్ ఎన్నికల తేదీలను మాత్రం ఇంకా ప్రకటించలేదు. కానీ అక్క‌డ జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిచి అధికార పీఠం ద‌క్కించుకోవాల‌ని రాష్ట్రంలోని ప్ర‌ధాన పార్టీల‌న్ని వ్యూహ‌ర‌చ‌న‌లు చేస్తున్నాయి. అధికార పార్టీ బీజేపీ, ప్ర‌తిప‌క్ష పార్టీలు కాంగ్రెస్, ఆప్ లు నువ్వా-నేనా అంటూ విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు గుప్పించుకుంటూ గుజరాత్ రాజ‌కీయాలను హీటెక్కించాయి. అధికార పార్టీ బీజేపీ మ‌రోసారి గుజ‌రాత్ అధికార పీఠం ద‌క్కించుకోవాల‌ని చూస్తోంది. దీని కోసం ఉన్న అన్ని వ‌నరుల‌ను, అవ‌కాశాల‌ను ఉప‌యోగించుకుంటోంది. 

ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌లే టార్గెట్ గా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ 16 మంది భార‌తీయ ప్ర‌ముఖు విగ్ర‌హాల‌ను గుజ‌రాత్ లో ఆవిష్క‌రించ‌నున్నార‌ని స‌మాచారం. ప్రధాని మోడీ, బీజేపీ నాయకుడు ముఖేష్ శుక్లా మహిసాగర్ జిల్లాలోని వీర్పూర్ పట్టణంలో 16 విగ్రహాలను ఆవిష్క‌రించ‌బోతున్నారు. ఈ విగ్రహాలను జైపూర్ లోని భారతీ శిల్పకళా స్టూడియోలో మహావీర్ భారతి, నిర్మలా కుల్హరి అనే ఇద్దరు యువ శిల్పులు త‌యారు చేస్తున్నారు. మహారాణా ప్రతాప్, స్వామి వివేకానంద, భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్, సుభాష్ చంద్ర బాస్, వీర్ సావర్కర్, బీఆర్ అంబేద్కర్, సర్దార్ పటేల్, మహాత్మా గాంధీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, అటల్ బిహారీ వాజ్ పేయి, ఏపీజే.అబ్దుల్ కలాం వంటి గొప్ప భారతీయ దిగ్గజాల విగ్రహాలను ఇరువురు కళాకారులు నిర్మించారు. విగ్రహాల పరిమాణాలు 3 అడుగుల నుండి 13 అడుగుల మధ్య ఉంటాయ‌ని స‌మాచారం. 

బెంగ‌ళూరు లోనూ.. 

వచ్చే నెలలో బెంగళూరులో కెంపేగౌడ 108 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించే అవ‌కాముంద‌ని సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఈ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై గ‌త గురువారం అధికారులను ఆదేశించారు. బెంగ‌ళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో అభివృద్ధి చేసిన కెంపేగౌడ థీమ్ పార్క్‌ను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం నవంబర్ 10న ప్రారంభోత్సవం జరిగే అవకాశం ఉందనీ, ఈ కార్యక్రమానికి లక్షలాది మంది తరలిరానున్నార‌ని తెలిసింది. కెంపేగౌడ హెరిటేజ్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ సమావేశానికి అధ్యక్షత వహించి ప్రారంభోత్సవ ప్రణాళికలను పరిశీలించిన అనంత‌రం ఆయ‌న ఈ బొమ్మై ఈ సంబంధిత విష‌యాల‌ను వెల్ల‌డించారు. దాదాపు ₹ 85 కోట్ల వ్యయంతో ఇక్కడి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (KIA)లో 220 టన్నుల బరువున్న ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

16వ శతాబ్దపు అధిపతికి అంకితం చేయబడిన సుమారు 23 ఎకరాలలో హెరిటేజ్ పార్క్ కూడా ఉంటుంది. విగ్రహ ఆవిష్కరణకు ముందు రాష్ట్రంలోని అన్ని గ్రామాల నుండి పవిత్రమైన మట్టి, నీటిని సేకరించే ప్రత్యేక ప్రచారాన్ని అధికారులు ప్రారంభించారు. ప్రఖ్యాత శిల్పి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత రామ్ వంజీ సుతార్ తన నోడియా స్టూడియోలో విగ్రహాన్ని రూపొందించారు. సుతార్ గుజరాత్‌లో స్టాట్యూ ఆఫ్ యూనిటీనీ, బెంగళూరులోని విధాన సౌధలో 'గాంధీజీ' విగ్రహాన్ని నిర్మించారు.