చెన్నై: యువతులు, మహిళల చిత్రాలను మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్న ఓ యువకుడికి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి బారిన పడిన బాధితులు తమకు ఫోన్ చేయాలని పోలీసులు కోరారు. 

తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్ లో కాశీ అనే యువకుడు యువతుల్ని మోసగిస్తున్నాడు. వారి ఫోటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఈ నిందితుడు పెళ్లైన వారిని కూడ లక్ష్యంగా చేసుకొని వారిని కూడ వేధిస్తున్నాడు.

రామనాథపురం పడమకుడికి చెందిన ఓ ఉద్యోగి జిల్లా ఎస్పీ వరుణ్ కుమార్ కు ఫిర్యాదు చేశాడు. తన భార్య చిత్రాలను మార్పింగ్ చేసిన యువకుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఫిర్యాదు చేశారు. తన భార్య తీవ్ర ఆందోళనతో ఉందన్నారు. 

తాను ఆ యువకుడితో మాట్లాడితే రూ. 20 వేలు ఇవ్వాలని లేకపోతే తన భార్య ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానని బెదిరిస్తున్నాడని ఎస్పీకి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు ఎస్పీ ఓ ప్లాన్ చేశాడు. నిందితుడిని పట్టుకొనేందుకు బాధితుడికి తన పథకాన్ని వివరించాడు.

నిందితుడు అడిగిన డబ్బులు ఇచ్చేందుకు తాను సిద్దంగా ఉన్నానని అతను ఫోన్ చేసి చెప్పాడు. శనివారం నాడు ఉదయం ఈ డబ్బులు తీసుకొనేందుకు వచ్చిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

నిందితుడు ఉన్న ఓ కళాశాలలో ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అతడు ఉలగనాథపురానికి చెందిన రోహిత్‌ గా గుర్తించారు. ఫేస్‌ బుక్, టిక్‌ టాక్, వాట్సాప్‌ల ద్వారా యుక్త వయస్సు దాటిన వాళ్లు, వివాహమైన మహిళల్ని టార్గెట్‌ చేశాడు. 

మహిళలతో పరిచయాలు పెంచుకొని వారి ఫొటోలను మార్ఫింగ్‌ చేసి వారికే పంపించేవాడు.  సామాజిక మాధ్యమాల్లోకి ఎక్కిస్తానని బెదిరించడం, కొందర్ని లొంగ దీసుకున్నట్టుగా గుర్తించారు. మరి కొందరి వద్ద నగదు దోచుకున్నట్టు పోలీసులు గుర్తించారు. 

అతడి సెల్‌ఫోన్‌ నిండా మార్ఫింగ్‌ చేసిన మహిళ చిత్రాలే ఉన్నాయి. బెదిరింపు మెసేజ్‌లు కూడ పోలీసులు గుర్తించారు.దీంతో నిందితుడి ద్వారా ఇబ్బందులకు గురైన వారు నిర్భయంగా తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరారు.బాధితుల సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని పోలీసులు ప్రకటించారు.