తమిళనాడు రాష్ట్రంలో మరో పరువు హత్య కలకలం రేపింది. ఇటీవల మిర్యాలగూడలో ప్రణయ్ అనే యువకుడు పరువు హత్యకు గురైన సంగతి తెలిసిందే. అచ్చం అలాంటి సంఘటనే తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో చోటుచేసుకుంది. అయితే.. ఇక్కడ ప్రియుడితోపాటు.. ప్రియురాలు కూడా ప్రాణాలు కోల్పోయింది. 

తన తండ్రే.. తన ప్రియుడిని హత్య చేయించడం చూసి తట్టుకోలేని ఆమె ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. తిరునల్వేలి జిల్లాకు చెందిన శంకర్(33) అనే యువకుడు సహకార సంఘ బ్రాంచ్ లో పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన బీకాం ఫైనలియర్ యువతిని శంకర్ మూడేళ్లుగా ప్రేమిస్తున్నాడు.

వీరి వివాహానికి శంకర్ తల్లిదండ్రులు అంగీకారం తెలపగా.. యువతి కుటుంబీకులు వ్యతిరేకించారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం స్నానానికి చెరవు వద్దకు వెళ్లిన శంకర్ ని.. యువతి తండ్రి డబ్బు ఇచ్చి మరీ ఓ ముఠాతో హత్య చేయించాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి.. మనస్థాపానికి గురై ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.