Cotton Candy Ban : పీచు మిఠాయిపై తమిళనాడు సర్కార్ నిషేధం .. ఎందుకంటే..?
చిన్నారుల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టపడే ఈ పీచు మిఠాయిపై తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించింది. వీటిని తయారు చేసినా , విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.
పీచు మిఠాయి.. ఈ పేరు వినగానే అందరూ చిన్నతనంలోకి వెళ్లిపోతారు. తియ్యగా.. రంగు రంగుల్లో దొరికే ఈ పీచు మిఠాయి టేస్ట్‌కి ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టపడే ఈ పీచు మిఠాయిపై తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించింది. కాటన్ క్యాండీ (పీచు మిఠాయి) విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ ప్రకటించారు.
వీటిలో క్యాన్సర్ కారక రసాయనాలు వున్నట్లుగా పరిశోధనల్లో తేలడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. పీచు మిఠాయిపై ఇటీవల చెన్నై నగరవ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కాటన్ క్యాండీల్లో ‘‘రోడమైన్ బీ ’’ అనే రసాయన పదార్ధాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. కృత్రిమ రంగుల కోసం దీనిని ఉపయోగిస్తున్నట్లు అధ్యయనంలో తేలింది.
రోడమైన్ బీని ఇండస్ట్రీయల్ డై గా వ్యవహరిస్తారు. దుస్తుల కలరింగ్, పేపర్ ప్రింటింగ్‌లో దీనిని వినియోగిస్తారు. అంతే తప్పించి ఫుడ్ కలరింగ్ కోసం ఉపయోగించరు. ఇది కలిసిన ఆహారాన్ని తింటే కిడ్నీ, లివర్ పనితీరుపై ప్రభావం చూపుతుందని, అల్సర్‌తో పాటు క్యాన్సర్‌కు దారి తీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిపై అప్రమత్తమైన తమిళనాడు ప్రభుత్వం కాటన్ క్యాండీ విక్రయాలపై నిషేధం విధించింది. వీటిని తయారు చేసినా , విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఆహార భద్రతా అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి .. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో ఆదేశించింది.