చెన్నై: ఇంట్లోకి చేరి ఇబ్బంది పెడుతున్న చీమల్ని చంపే ప్రయత్నంలో ప్రమాదానికి గురయి ఓ యువతి మృతిచెందింది. కుటుంబసభ్యుల కళ్లేదుటే యువతి సజీవదహనం అయ్యింది. ఈ విషాద సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... చెన్నైలోని అమింజికరై కాలనీ పెరుమాల్ ఆలయ వీధిలో సత్యమూర్తి అనే వ్యక్తి భార్యా పిల్లలతో కలిసి నివాసముంటున్నాడు. అతడి కుమార్తె సంగీత(27) షోళింగనల్లూరులోని ఓ సంస్థలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌ గా పనిచేసేది. అయితే శనివారం సెలవురోజు కావడంతో ఇంట్లోనే వున్న సంగీత కొద్దిరోజులగా ఇంట్లో ఎక్కడపడితే అక్కడ వుండి ఇబ్బందిపెడుతున్న చీమలను చంపాలని నిర్ణయించుకుంది. 

దీంతో చీమల గుంపుపై కిరోసిన్ పోసి నిప్పుపెట్టడం ప్రారంభించింది. ఈ క్రమంలో ఆమె చేతిలోని కిరోసిన్ బాటిల్ కు నిప్పు అంటుకుని అది కాస్తా సంగీత శరీరానికి అంటుకుంది. తమ కళ్ల ముందే ఆమె మంటల్లో కాలిపోతుంటే కుటుంబసభ్యులు కాపాడే ప్రయత్నం చేసినా సాధ్యంకాలేదు. చివరకు ఇరుగుపొరుగు వారు కలిసి ఎలాగోలా ఆమెను మంటల నుండి కాపాడారు. కానీ అప్పటికే ఆమె శరీరం  పూర్తిగా కాలిపోయింది. 

కొన ఊపిరితో కొట్టుకుంటున్న సంగీతను హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించినా ఫలితం లేకుండాపోయింది. శరీరమంతా కాలిపోవడంతో  డాక్టర్లు కూడా ఆమెను కాపాడలేకపోయారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం సంగీత తుదిశ్వాస విడిచింది.