ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రముఖ సినీనటుడు కమల్ హాసన్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు తమిళనాడు సీఎం పళనిస్వామి. బాబు అధికారం కోసం రంగులు మార్చే ఊసరవెళ్లని  ఘాటుగా విమర్శించారు.

బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి విపక్ష కూటమి ఏర్పాటులో భాగంగా చంద్రబాబు రెండు రోజుల క్రితం డీఎంకే అధినేత స్టాలిన్‌ను కలుసుకున్నారు.. ఎలాగైనా అధికారంలోకి రావడమే వారిద్దరి ఆశయమని.. అందుకోసం రోజుకో రంగు మార్చడానికి కూడా వెనుకాడరని పళనిస్వామి ఆరోపించారు.

అలాగే అన్నాడీఎంకే ప్రభుత్వంపై తరచుగా విమర్శలకు దిగుతున్న ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్‌ను సీఎం వదిలిపెట్టలేదు. రాజకీయాల్లోకి వచ్చే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని.. అయితే రాజకీయాల్లో నిలబడాలంటే మాత్రం చాలా కష్టపడాలని అన్నారు.

లగ్జరీ జీవితాలు గడిపే నటులు ప్రజాసమస్యలు ఎలా పరిష్కరించగలరని ప్రశ్నించారు. గతంలో ఒక చిత్ర నిర్మాణ సమయంలో సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొన్న కమల్ విదేశాలకు పారిపోవడానికి సిద్ధపడ్డారని గుర్తు చేశారు..

అసలు ప్రజా సమస్యలను పరిష్కరించే సత్తా ఆయనలో ఉందా అని ప్రశ్నించారు. ఒక ముఖ్యమంత్రిగా తాను ప్రజల్లోకి నిరంతరం వెళుతూ వారి సమస్యల పరిష్కారానికి శ్రమిస్తున్నానని పళనిస్వామి తెలిపారు.