ఫీల్డ్ పర్యటనలో సీఎం.. ఫిబ్రవరిలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కొత్త కార్యక్రమం
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్.. క్షేత్రస్థాయిలో పర్యటన చేయబోతున్నారు. తొలి విడతలో భాగంగా ఫిబ్రవరి 1వ తేదీ, 2వ తేదీల్లో ఆయన నాలుగు జిల్లాల్లో పర్యటించి అధికారులు, రైతులు, స్వయం సహాయక సంఘాలు, పరిశ్రమల ప్రతినిధులతో సమావేశం అవుతారు.
చెన్నై: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కొత్త ప్రొగ్రామ్ చేపట్టబోతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఫిబ్రవరిలో ఆయన ‘ఫీల్డ్ పర్యటనలో సీఎం’ అనే కార్యక్రమం చేపట్టబోతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు ఆయా జిల్లాల్లో ప్రజలకు అందుతున్నాయా? లేదా ? అనే అంశాన్ని సమీక్షిస్తారు.
ఈ అధ్యయనం ద్వారా లబ్దిదారులకు సంక్షేమ ఫలాలు, ఈ పథకాలు, ప్రాజెక్టుల ద్వారా ఉద్దేశించిన ప్రజల బాగు జరుగుతున్నదా? లేదా? అనేది స్పష్టం కానుంది.
తాగు నీరు, పరిశుభ్రత, రోడ్లు, ప్రజా మౌలిక సదుపాయాలు, నైపుణ్యాల అభివృద్ధి, గ్రామీణ, పట్టణ అభివృద్ధి, విద్య, ఆరోగ్యం, చిన్న పిల్లలకు పౌష్టిక ఆహారం, సహా పలు సేవలు ప్రజలకు ఏ స్థాయిలో చేరుతున్నాయనే విషయాన్ని సీఎం, సంబంధిత మంత్రులు, అధికారులూ పరిశీలిస్తారని ప్రభుత్వ ప్రకటన పేర్కొంది.
Also Read: ఫిబ్రవరి 17న తెలంగాణ సచివాలయ ప్రారభోత్సవం: హజరు కానున్న తమిళనాడు, జార్ఖండ్ సీఎంలు
మొదటి విడతలో భాగంగా సీఎం ఎంకే స్టాలిన్, సీనియర్ మంత్రులు, అధికారులతో కలిసి రాణిపేట్, వెల్లూర్, తిరుప్పట్టూర్, తిరువన్నమలై జిల్లాల్లో పర్యటన చేస్తారు. ఫిబ్రవరి 1వ తేదీ, 2వ తేదీల్లో ఈ పర్యటన ఉంటుంది.,
ఫిబ్రవరి 1వ తేదీన రైతు సంఘాల ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాలు, పరిశ్రమల ప్రతినిధులతో సీఎం స్టాలిన్ సమావేశం అవుతారు. అదే రోజు ఈ నాలుగు జిల్లాల్లో లా అండ్ ఆర్డర్ పరిస్థితులపై ఉన్నత పోలీసు అధికారులతో సమావేశమై సమీక్షలు చేస్తారు. అదే రోజు డీఎంకే మంత్రులు, సెక్రెటరీలు ఆయా కీలక శాఖల్లో ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టుల అమలు తీరు ఆ నాలుగు జిల్లాల్లో ఎలా ఉన్నదో సమీక్షిస్తారు. ఈ సమాచారం పై ఫిబ్రవరి 2వ తేదీన సీఎం ఎంకే స్టాలిన్‌తో సమావేశంలో చర్చిస్తారు. ఆ తర్వాత రెండో విడత సీఎం ఆన్ ఫీల్డ్ కార్యక్రమ షెడ్యూల్ ఉంటుంది.