వైద్యుల నిర్లక్ష్యం కారణంగా సంవత్సరం వయసు ఉన్న ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన  తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. కాగా.. తమ కుమారుడి చావుకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ హాస్పిటల్ వద్ద వారు ఆందోళన చేపట్టారు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే... భాస్కర్(35), ప్రీతి(26) దంపతులకు కెవిన్ అనే సంవత్సరం వయసుగల కుమారుడు ఉన్నాడు. కాగా.. కెవిన్ కి గత రెండు రోజుల క్రితం తీవ్రమైన జలుబు, దగ్గు, జ్వరం వచ్చాయి. దీంతో... బాలుడిని తల్లిదండ్రులు రాజా మీరాసుదార్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. కాగా.. అక్కడ బాలుడిని పరిశీలించిన వైద్యులు చనిపోయాడంటూ తేల్చి  చెప్పారు.

తాము చిన్నారిని కాపాడేందుకు ప్రయత్నించామని.. కానీ బాలుడు చనిపోయాడంటూ వారు పేర్కొన్నారు.  దీంతో... బాబు మృతదేహాన్ని తీసుకొని ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు అంత్యక్రియలకు ఏర్పాట్లు  చేశారు. ఆ సమయంలో బాలుడు కదలడాన్ని కొందరు బంధువులు గుర్తించారు. బాబు చిన్నగా గురక పెట్టడం కూడా వినపడింది. దీంతో.. వెంటనే పరుగున చిన్నారిని మళ్లీ తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అయితే.. ఈసారి బాలుడు నిజంగానే చనిపోయాడు.

దీంతో.. కెవిన్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా చిన్నారికి ముందుగానే వైద్యం అందించినట్లు అయితే.. కచ్చితంగా బతికేవాడని వారు ఆరోపిస్తున్నారు. హాస్పిటల్ ముందు కూర్చోని ఆందోళన చేపట్టారు. కాగా... పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా... బాధితుల ఆరోపణలను హాస్పిటల్ యాజమాన్యం కొట్టిపారేసింది. బాలుడు ముందే చనిపోయాడని... మళ్లీ కదలాడను అనడంలో నిజం లేదని వారు తేల్చి చెబుతున్నారు. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.