కరోనా ఉద్ధృతితో దేశంలో లాక్‌డౌన్‌ను విధించిన కొత్తల్లో నిబంధనలను పాటించని వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరించిన ఘటనలు అనేకం జరిగాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే అదే తరహా సంఘటనలు జరుగుతున్నాయి.

తమిళనాడులో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారనే నెపంతో జయరాజ్, బెనిక్స్ అనే తండ్రి కొడుకులను విచక్షణారహితంగా కొట్టడంతో వారిద్దరూ చనిపోయిన సంగతి తెలిసిందే. దీంతో తమిళనాడు అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే.

ఇంత జరుగుతున్నా తమిళనాడు పోలీసుల్లో మార్పు రావడం లేదు. మరో ఘటనలో ఓ ఆటో డ్రైవర్‌ను విచక్షణారహితంగా చితకబాదడంతో అతను మరణించాడు. వివరాల్లోకి వెళితే.. తిరునల్వేలి ప్రాంతానికి చెందిన కుమరేశన్‌ను ఓ భూ సంబంధమైన కేసులో పోలీసులు రిమాండ్‌లో ఉంచారు. విచారణ నెపంతో అతనిని చితకబాది విడిచిపెట్టారు.

కుమరేశన్ ఇంటికి వెళ్లగానే మాట్లాడలేని స్ధితిలో ఉండటంతో కుటుంబసభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. 15 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన అతను శనివారం తుదిశ్వాస విడిచాడు.

మూత్రపిండాలు దెబ్బతినడం వల్లనే కుమరేశన్ మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీంతో మృతుని కుటుంబసభ్యులు తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. పోలీసులు తీవ్రంగా హింసించడం వల్లే తమ కుమారుడు మరణించాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

దీనికి తోడు గత 15 రోజులుగా పోలీసుల నుంచి తమకు బెదిరింపులు వస్తున్నాయని మృతుని తండ్రి పేర్కొన్నాడు. ఈ ఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు దీనికి కారణంగా భావిస్తున్న ఎస్సై చంద్రశేఖర్, కుమార్ కానిస్టేబుల్‌పై ఐపీసీ సెక్షన్ 173 (3) కింద కేసు నమోదు చేసి దర్యాప్తునకు ఆదేశించారు.