చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ పరిణామాలు రోజురోజుకు ఉత్కంఠ రేపుతున్నాయి. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ ల ప్రమేయం రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. 

తమిళనాడు ప్రజలు మార్పు కోరుకుంటున్నారని వారు ఆశిస్తున్న ఆకాంక్షను నెరవేర్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కమల్ హాసన్ స్పష్టం చేశారు. అవసమైతే రాబోయే ఎన్నికల్లో తన చిరకాల మిత్రుడు రజనీకాంత్ తో కలిసి పనిచేస్తామని కూడా ప్రకటించారు. 
 
కమల్ హాసన్ వ్యాఖ్యలపై స్పందించారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. తమిళనాడు రాజకీయాల్లో కమల్ హాసన్ అనుకున్నది సాధిస్తారని తెలిపారు. 2021 ఎన్నికల్లో అద్భుతాలు సృష్టిస్తామని స్పష్టం చేశారు.   

ఎన్నికల్లో పోటీ చేసే అంశం, కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం పార్టీతో పొత్తు అనే అంశాలు ఎన్నికల సమయంలో నిర్ణయిస్తామని తెలిపారు. అదే సమయంలో చీఫ్ మినిస్టర్ ఎవరు అనేదానిపై కూడా చర్చిస్తామని తెలిపారు.  
 
తాను త్వరలోనే రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు రజనీకాంత్ స్పష్టం చేశారు. తమ పార్టీ నాయకులతో చర్చించి, కమల్ హాసన్  పార్టీతో పొత్తు, ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ప్రకటన విడుదల చేస్తామని తెలిపారు. ఈ వ్యహారమంతా ఎన్నికలకు అతి సమీపంలోనే జరుగుతుందని చెప్పుకొచ్చారు. 

గోవాలో ఐఫా గోల్డెన్ జూబ్లీ ఐకాన్ అవార్డు అందుకున్న అనంతరం చెన్నై ఎయిర్ పోర్ట్  చేరుకున్న రజనీకాంత్ తనకు వచ్చిన అవార్డును తమిళనాడు ప్రజలకు అంకితమిచ్చారు. కమల్ హాసన్ పార్టీతో పొత్తు, ఆయన స్నేహ హస్తంపై మీడియాతో మాట్లాడారు.

2021 ఎన్నికల్లో తమిళనాడు ప్రజలు అద్భుతాలు చూపిస్తారంటూ తెలిపారు. 2021 ఎన్నికల్లో తన ప్రభావంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు రజనీకాంత్. కమల్ హాసన్ అనుకున్నది సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. 

ఇకపోతే ఇటీవలే తమిళనాడు సీఎం ఎడపాడి పళని స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ పార్టీ పెట్టినా ఎలాంటి ప్రభావం ఉండదంటూ సంచలన వ్యాక్యలు చేశారు. ఒక నటుడు ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తారంటూ సెటైర్లు వేశారు. కమల్ హాసన్, రజనీకాంత్ ల జోడి పిల్లి ఎలుకల జోడి అంటూ అభివర్ణించారు.