కేంద్రప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని సమర్ధించారు తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్. ఉప రాష్ట్రపతిగా రెండేళ్ల ప్రస్థానంలో లిజనింగ్, లెర్నింగ్, లీడింగ్ పేరుతో వెంకయ్య నాయుడు రచించిన పుస్తకావిష్కరణ కార్యక్రమం చెన్నైలోని కలైవనర్ ఆరంగంలో జరిగింది.

ఈ కార్యక్రమానికి హాజరైన రజనీకాంత్ ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలు కృష్ణార్జునుల వంటి వారని అభివర్ణించారు. ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ.. తాను ఎక్కడికి వెళ్లినా ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తానని.. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా.. నేర్చుకోవడం మాత్రం ఆపొద్దని ఆయన పిలుపునిచ్చారు.

తాను ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నాని.. ప్రజాసేవకు కాదని.. ఏ హోదాల్లో ఉన్నప్పటికీ ప్రజలకు దగ్గరగానే ఉన్నానని వెంకయ్య తెలిపారు.  అయితే పార్టీ కార్యకర్తలకు దూరంగా ఉండటం బాధగా అనిపిస్తుందని.. ఉపా రాష్ట్రపతిని కావాలని తానెప్పుడూ కోరుకోలేదని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని సుమారు 600కు పైగా జిల్లాల్లో పర్యటించానని.. విద్యార్థి దశ నుంచి కూడా తనకు దేశంలో తిరగడమంటే ఎంతో ఇష్టమన్నారు.

దక్షిణ భారతదేశానికి చెందిన వ్యక్తిని ఉపరాష్ట్రపతిగా చేయాలని పార్టీ అధిష్టానం భావించిందని.. అదే సమయంలో తాను అయితేనే ఆ పదవికి సరైన వ్యక్తినని సీనియర్ నేతలు సూచించారని ఉప రాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ కార్యక్రయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్, తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి తదితరులు పాల్గొన్నారు.