చెన్నై: తన రాజకీయ రంగ ప్రవేశంపై తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఎటూ తేల్చలేదు. వీలైనంత త్వరగా తన నిర్ణయాన్ని చెబుతానని ఆయన అన్నారు. తన అభిమాన సంఘం అధ్యక్షకార్యదర్శులతో రజినీకాంత్ సోమవారం సమావేశమయ్యారు. తన రాజకీయ రంగ ప్రవేశంపై రజినీకాంత్ ఈ సమావేశంలో స్పష్టత ఇస్తారని భావించారు. 

కానీ రజినీకాంత్ ఎటూ తేల్చకపోవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. ఇంకా ఆలస్యం చేస్తే నష్టం జరుగుతుందని అభిమానులు అన్నారు. మీరే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండాలని వారు కోరారు. దాదాపు రెండు గంటల పాటు సమావేశం జరిగింది. అభిమాన సంఘం నాయకుుల తీవ్రమైన ఒత్తిడి చేసినప్పటికీ ఏమీ చెప్పకుండా రజినీకాంత్ సమావేశం నుంచి వెళ్లిపోయారు. 

పార్టీ పెట్టి తమిళనాడుకు సీఎం కావాలని అభిమానులు నినాదాలు చేశారు. సమావేసానికి దాదాపు 30 మంది హాజరయ్యారు. ఈ రోజు సాయంత్రం గానీ రేపు ఉదయం గానీ రజినీకాంత్ తన రాజకీయ రంగ ప్రవేశంపై ప్రకటన చేస్తారని ఆశిస్తున్నారు. 

చాలా కాలంగా రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై తమిళనాడులో చర్చ సాగుతోంది. అయితే, ఆయన ఎప్పటికప్పుడు దాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు. తమిళనాడు శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆయన ఈసారి కచ్చితంగా రాజకీయ రంగ ప్రవేశంపై ప్రకటన చేస్తారని భావించారు. కానీ అది జరగలేదు.