కడలూరు: భర్తపై కోపంతో ఓ మహిళ తన ముగ్గురు కూతుళ్లను కాలువలో పడేసి చంపేసింది. ఈ సంఘటన తమిళనాడులోని కడలూరు జిల్లా సెతాయ్ తోపేలో జరిగింది. కూతుళ్లను చంపేసిన 27 ఏళ్ల మహిళ గురువారం ఉదయం పోలీసులకు లొంగిపోయింది.

పోలీసులు స్థానికుల సహాయంతో ముగ్గురు బాలికల శవాలను కాలువ నుంచి వెలికి తీశారు. శవాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎం సత్యవతి (27) అనే మహిళకు బోర్ వెల్ వర్కర్ గా పనిచేస్తున్న ఎస్ మణికందన్ (33)తో ఏడేళ్ల క్రితం వివాహమైంది. 

దంపతులకు అక్షయ (6), నందిని (4), దర్శిణి (2) అనే ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. అక్షయ, నందిని వృద్ధాచలం సమీపంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటున్నారు. మణికందన్ నిత్యం తాగి వస్తూ భార్యతో గొడవపడుతూ ఉండేవాడు. 

సెప్టెంబర్ 24వ తేదీన భర్తతో గొడవ పడి తన ముగ్గురు పిల్లలతో సత్యవతి తల్లిగారింటికి వెళ్లింది. తల్లి భర్త వద్దకు వెళ్లాలని నచ్చజెప్పి బుధవారం ఉదయం సత్యవతిని ముగ్గురు పిల్లలతో బస్సు ఎక్కించింది. 

సత్యవతి ఇంటికి వెళ్లడానికి బదులు సత్తాయ్ తోపె జంక్షన్ వద్ద దిగింది. సాయంత్రం వరకు పిల్లలతో అక్కడే గడిపింది. ఆ తర్వాత పిల్లలను కాలువలో పడేసి అక్కడి నుంచి పారిపోయింది. మర్నాడు ఉదయం పోలీసులకు లొంగిపోయింది.