ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి బంధంలోకి ఆ దంపతులు అడుగుపెట్టి కనీసం నెలరోజులైనా గడవలేదు. అంతలోనే భర్తకు, ఇంటికీ నిప్పు పెట్టింది ఆ నూతన వధువు. ఈ సంఘటన తమిళనాడులోని విల్లుపురం జిల్లా దిండివనంలో శుక్రవారం చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... టీవీ నగర్ కి చెందిన దక్షిణామూర్తి, మారియమ్మాల్ దంపతుల దత్తపుత్రుడు సేతుపతి... దిండివనంకు చెందిన మురగవేణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహం జరిగి 20 రోజులు అవుతోంది. కాగా.. గురువారం సాయంత్రం సేతుపతి ఇంట్లో నిద్రిస్తుండగా... ఆ గదికి గడియ పెట్టి.. మురగవేణికి ఇంటికి నిప్పు పెట్టింది. అనంతరం అక్కడి నుంచి పరారయ్యింది. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మంటలు అదుపుచేసి చూసేసరికి సేతుపతి అప్పటికే సజీవదహనమయ్యాడు.

పరారీలో ఉన్న మురగవేణిని పోలీసులు పట్టుకొని విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పెళ్లికి ముందు బుద్ధిమంతుడుగా ఉన్న సేతుపతి, పెళ్లైన రోజు నుంచి ప్రతిరోజూ మద్యం తాగి రావడం, రాత్రుల్లో నరకం చూపిస్తుండడం, అనుమాన పడడం, నోటికి వచ్చినట్టుగా ఇష్టానుసారంగా తిట్టాడని ఆమె పేర్కొంది. ఈ క్రమంలో వాటిని తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.