గత నెలలో చెన్నైలో ఓ పార్టీ హోర్డింగ్ మీద పడి ఆ తర్వాత ఓ లారీ దూసుకువెళ్లి శుభశ్రీ అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా... అచ్చం అలాంటి సంఘటనే మరోటి చోటుచేసుకుంది. ఈ సంఘటన కూడా తమిళనాడు రాష్ట్రంలోనే చోటుచేసుకోవడం గమనార్హం.

తమిళనాడు రాష్ట్రానికి చెందిన  అనురాధ(30) అనే మహిళ ఓ హోటల్‌లో అకౌంట్స్ సెక్షన్‌లో పనిచేస్తూ కుటుంబానికి అండగా ఉంటోంది. రోజూలానే స్కూటీపై అనురాధ ఉద్యోగానికి వెళుతుండగా కోయంబత్తూరులోని అవినాషి రోడ్‌లో రోడ్డు మధ్యలో ఏర్పాటు చేసిన అన్నాడీఎంకే జెండా ఉన్నట్టుండి కింద పడింది. దీంతో.. దానిని తప్పించే ప్రయత్నంలో ఆమె అదుపు తప్పి కింద పడింది. 

అదే సమయంలో అటుగా వేగంగా వస్తున్న ఓ లారీ కింద పడిన ఆమె స్కూటీపై నుంచి వెళ్లింది. ఈ ఘటనలో అనురాధ కాళ్లు తీవ్రంగా దెబ్బ తిన్నట్లు వైద్యులు తెలిపారు. ఓ కాలి నరం పూర్తిగా తెగినట్లు వెల్లడించారు.
 
శుభశ్రీ ఘటనతో మద్రాస్ హైకోర్టు చీవాట్లు పెట్టినప్పటికీ రాజకీయ పార్టీల కార్యకర్తలు, నేతల వైఖరిలో ఏ మాత్రం మార్పు రాలేదు. పార్టీల జెండాలు, కటౌట్లతో రోడ్లను నింపేస్తున్నారు. ఈ ఘటనతో అనురాధ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాగా...  అనురాధ ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.

ఇదిలా ఉండగా... సెప్టెంబర్ 12వ తేదీన సాఫ్ట్ వేర్ ఉద్యోగి శుభశ్రీ స్కూటర్ మీద వెళుతుండగా...ఓ పెద్ద పార్టీ హోర్డింగ్ వచ్చి ఆమె మీద పడింది. ఆ వెంటనే ఓ వాటర్ ట్యాంకర్ ఆమెను ఢీకొట్టింది. దీంతో ఆ యువతి అక్కడికక్కడే మృతి చెందింది.

ఈ ఘటనపై పలు వివాదం నెలకొంది. అసలు హోర్డింగ్ లు ఏర్పాటు చేయడంపైనే విమర్శలు వచ్చాయి. సినీ హీరోలు కూడా తమ అభిమానులకు ఈ విషయంపై సూచనలు చేశారు. తమ సినిమాలకు, తమ ఫోటోలను హోర్డింగ్ లు పెట్టవద్దని కోరారు. ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చింది. దీంతో ఈ ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను ఆదేశాలు వచ్చాయి.