తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడులో సీబీఐ విచారణకు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. మనీలాండరింగ్ కేసులో మంత్రి వి.సెంథిల్ బాలాజీ అరెస్ట్ అయిన కొద్ది గంటలకే తమిళనాడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర మంత్రి వి.సెంథిల్ బాలాజీపై ఈడీ చర్యలు తీసుకున్న తర్వాత స్టాలిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కేసుల దర్యాప్తునకు సీబీఐకి ఉన్న సాధారణ సమ్మతిని ఉపసంహరించుకున్నారు. ఇకపై కేంద్ర ఏజెన్సీలు విచారణ చేయాలంటే..రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
తమిళనాడు హోం శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)కి ఇచ్చిన సాధారణ సమ్మతిని తమిళనాడు ప్రభుత్వం ఉపసంహరించుకుంది. తాజా ప్రకటన ప్రకారం.. రాష్ట్రంలో కొత్త కేసును దర్యాప్తు చేయడానికి కేంద్ర ఏజెన్సీ, సీబీఐ తమిళనాడు ప్రభుత్వం నుండి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఇప్పటికే పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, కేరళ, మిజోరాం, పంజాబ్, తెలంగాణతో సహా తొమ్మిది రాష్ట్రాలు ఇప్పటికే ఈ చర్య తీసుకున్నట్టు ప్రకటనలో పేర్కొంది.
మరోవైపు, మనీలాండరింగ్ కేసు కింద తమిళనాడు విద్యుత్, ఎక్సైజ్ శాఖ మంత్రి వి.సెంథిల్ బాలాజీని ఇడి బుధవారం అరెస్టు చేసింది. తమిళనాడులో ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ప్రభుత్వంలో కేంద్ర ఏజెన్సీ నుండి ఇటువంటి చర్యను ఎదుర్కొన్న మొదటి మంత్రి బాలాజీ. చెన్నైలోని స్థానిక కోర్టు బాలాజీని జూన్ 28 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
ఈ విషయంపై ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడుతూ.. విచారణకు పూర్తి సహకరిస్తామని బాలాజీ హామీ ఇచ్చినప్పుడు సుదీర్ఘంగా విచారించాల్సిన అవసరం ఏముందన్నారు. ఈడీ అటువంటి అమానవీయ చర్య సమర్థించబడుతుందా అని ఆయన అన్నారు. 2014-15లో నేరం జరిగినప్పుడు బాలాజీ అన్నాడీఎంకేలో ఉన్నారు. ఆ సమయంలో రవాణా మంత్రిగా ఉన్నారని తెలిపారు
కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఫైర్
సెంథిల్ బాలాజీ అరెస్ట్ తర్వాత కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష పార్టీల నేతలు కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ.. అధికార పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వారిపై రాజకీయ వేధింపులు, ప్రతీకార చర్యలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఇలాంటి చర్యలకు ప్రతిపక్షాలు తలొగ్గబోవని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఇది వ్యతిరేకించే వారిపై మోడీ ప్రభుత్వం చేస్తున్న రాజకీయ ప్రక్షాళన, ప్రతీకార చర్య అని పేర్కొన్నారు.
