Tamil Nadu: ప్రియుడి కండ్ల ముందటే.. ప్రేయసిపై లైంగికదాడి జరగడంతో ఆవేదనకు గురైన యువకుడు ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించిన ఘటనతో పాటు రాష్ట్రంలో మరో రెండు సామూహిక లైంగిక దాడులు తమిళనాడులో సంచలనంగా మారాయి.
Tamil Nadu: తమిళనాడులో మహిళలపై వరుసగా చోటుచేసుకుంటున్న లైంగిక దాడులు, హింసాత్మక ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవలే రెండు సామూహిక అత్యాచారాలు కలకలం రేపగా..తాజాగా తన కండ్ల ముందటే ప్రేయసిపై లైంగికదాడి జరగడంతో ఆవేదనకు గురైన ప్రియుడు ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ దారుణ ఘటన రాష్ట్రంలోని విరుదునగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. విరుదునగర్ జిల్లా అరుప్పుకోట ప్రాంతానికి చెందిన యువతి, ఆమె ప్రియుడు కలిసి ఈనెల 23న స్థానికంగా ఉన్న సముద్ర తీరానికి వెళ్లారు. బీచ్‌లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే వారి వద్దకు వచ్చిన ముగ్గురు దుండగులు వారిపై దాడి చేశారు. యువకుడిని తీవ్రంగా కొట్టి.. అతని కండ్ల ముందటే యువతిపై లైంగికదాడి చేశారు. అనంతరం వారి వద్ద నుంచి నగలు, డబ్బులు దోచుకుని పారిపోయారు. అయితే, తన కండ్ల ముందరే ప్రేయసిపై లైంగికదాడి జరగడంతో ఆవేదనకు గురైన ప్రియుడు.. బలవంతంగా తన ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించాడు. పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. నిందితులు పరారీలో ఉన్నారనీ, వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు.
ఇదిలావుండగా, ఉత్తర తమిళనాడులో ఒకటి, దక్షిణ తమిళనాడులో చోటుచేసుకున్న మరో ఘటనలు మహిళల రక్షణపై ఆందోళన కలిగిస్తున్నాయి. గత వారం రోజులుగా మైనర్‌లపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనలు రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. దక్షిణాదిలోని విరుదునగర్‌లో 22 ఏళ్ల యువతిపై లైంగికదాడి ఘటన సంచలనం రేపింది. షెడ్యూల్డ్ కులానికి చెందిన బాధితురాలు ప్రైవేట్ మిల్లులో పనిచేస్తూ కుటుంబ భారాన్ని నెట్టుకొస్తోంది. ఈ క్రమంలోనే ఎం. హరిహరన్ తో స్నేహం ఏర్పడింది. మాయమాటలతో లోబర్చుకున్న నిందితుడు.. వారి లైంగిక సంబంధం వీడియో తీశాడు. అప్పటినుంచి వీడియోతో బ్లాక్‌మెయిల్ చేస్తూ.. వేధింపులకు గురిచేశాడు. ఇలా బెదిరిస్తూ.. లైంగికదాడి చేయడంతో పాటు ఆ వీడియోను తన స్నేహితులతో పంచుకున్నాడు. ఆ క్లిప్ ను ఉపయోగించుకుని బాధితురాలని భయపెడుతూ.. వారు కూడా ఆమెపై లైంగికదాడి చేశారు.
వారి చిత్రహింసలు భరించలేని బాధితురాలు సాంఘిక సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న మహిళా హెల్ప్‌లైన్ 181కి డయల్ చేసి చెప్పడంతో వెలుగులోకి వచ్చింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు ఇప్పటికే ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. విరుదునగర్ రూరల్ పోలీసులు వారిపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు 376 (2), 354C, 354D కింద కేసులు నమోదుచేశారు. ఈ దారుణమైన వరుస అత్యాచారం కేసులో విరుదునగర్ పోలీసులు వేగంగా వ్యవహరించి నిందితులందరినీ అరెస్టు చేయడమే కాకుండా సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు అఖిల భారత ప్రజాస్వామ్య మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎస్.లక్ష్మి తెలిపారు.
